శ్రీశైలానికి బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి రానుందా? హైదరాబాద్ నుంచి కేవలం గంటలోనే శ్రీశైలానికి చేరుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం ఈ ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. అయితే ఇప్పటివరకు శ్రీశైలం మీదుగా బుల్లెట్ ట్రైన్ ఖరారు కాలేదు. తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదన మేరకు మార్పులు జరిగితే మాత్రమే ఈ అవకాశం ఏర్పడనుంది.
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన హైదరాబాద్–బెంగళూరు హైస్పీడ్ రైలు కారిడార్ ప్రస్తుతం సర్వే, అలైన్‌మెంట్, డీపీఆర్ (వివరణాత్మక ప్రాజెక్టు నివేదిక) దశలో ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలైన్‌మెంట్‌లో మార్పులు చేయాలని కేంద్రానికి సూచించింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులతో నిర్వహించిన సమావేశంలో, ఈ కారిడార్‌ను శంషాబాద్ – ఫ్యూచర్ సిటీ – ఆమనగల్లు – మన్ననూరు – శ్రీశైలం – సోమశిల మీదుగా బెంగళూరుకు అనుసంధానం చేసేలా ప్రతిపాదించాలని సూచించారు. శ్రీశైలానికి భారీ సంఖ్యలో భక్తులు ప్రయాణిస్తుండటంతో వారికి ప్రయోజనం కలిగేలా ఈ మార్పు ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
గతంలో రూపొందించిన ప్రాథమిక అలైన్‌మెంట్ ప్రకారం ఈ మార్గం శంషాబాద్ – మహబూబ్‌నగర్ – కర్నూలు మీదుగా ఉండేది.
అలాగే హైదరాబాద్–చెన్నై బుల్లెట్ ట్రైన్ కారిడార్ విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం కొన్ని మార్పులను ప్రతిపాదించింది. మొదట నిర్ణయించిన మార్గానికి బదులుగా బాటసింగారం – నార్కట్‌పల్లి – సూర్యాపేట – ఖమ్మం మీదుగా అమరావతికి అనుసంధానం చేసేలా కేంద్రానికి సూచనలు పంపనున్నట్లు సమాచారం.
కాగా, ఈ మార్పులకు కేంద్ర ప్రభుత్వం ఇంకా అధికారిక ఆమోదం ఇవ్వలేదు. అలైన్‌మెంట్ తుది నిర్ణయం కేంద్రం, సంబంధిత రైల్వే సంస్థల పరిశీలన తర్వాతే ఖరారు కానుంది.




