Home జాతీయం సాంకేతిక చిక్కుల్లో ‘సర్’ ప్రక్రియ.. ఓటర్లకు తప్పని ఇబ్బందులు

సాంకేతిక చిక్కుల్లో ‘సర్’ ప్రక్రియ.. ఓటర్లకు తప్పని ఇబ్బందులు

23
0

సాంకేతిక చిక్కుల్లో ‘సర్’ ప్రక్రియ.. ఓటర్లకు తప్పని ఇబ్బందులు

కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ క్షేత్రస్థాయిలో సాంకేతిక సమస్యలతో నత్తనడకన సాగుతోంది. వెబ్‌సైట్‌లు, మొబైల్ యాప్‌లు సరిగా పనిచేయకపోవడంతో పాటు సర్వర్లు తరచూ డౌన్ అవుతుండటంతో ఓటర్లు, బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌వోలు) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు అందకపోవడం, ఆన్‌లైన్ సేవలు అర్థంకాకపోవడం, వివరాల నమోదులో సాంకేతిక ఆటంకాలు తలెత్తడంతో లక్షలాది మంది ఓటర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.

ఆధార్–ఓటర్ వివరాల మిస్‌మ్యాచ్‌తో కొత్త తలనొప్పి

ఓటరు కార్డు, ఆధార్ కార్డులోని పేరు, వయస్సు, చిరునామా వంటి వివరాలు సరిపోకపోవడం వల్ల అనేక దరఖాస్తులు నిలిచిపోతున్నాయి. ఆధార్‌లో పాత వివరాలు, పాత మొబైల్ నంబర్లు కొనసాగుతుండటంతో చిరునామా మార్పు, కొత్త ఓటరు నమోదు వంటి సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గ్రామాల నుంచి నగరాలకు లేదా ఇతర ప్రాంతాలకు మారినవారు, పత్రాలు అందని వారు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకునే సమయంలో మరింత ఇబ్బంది పడుతున్నారు.

విదేశాల్లో ఉన్న కుటుంబ సభ్యులతో సంతకాల సమస్య

చాలా కుటుంబాల్లో ఓటర్లకు సంబంధించిన ఫారాలు ఇంటికే అందుతున్నప్పటికీ, వారి కుమారులు, కుమార్తెలు లేదా కోడళ్లు విదేశాల్లో ఉండటంతో సంతకాల నిబంధన ఇబ్బందిగా మారుతోంది. మల్కాజిగిరికి చెందిన ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండటంతో ఫారాలపై సంతకాలు ఎలా చేయాలంటూ బీఎల్‌వోలను ఆశ్రయించగా, ఆన్‌లైన్‌లో ఎన్‌ఆర్‌ఐ ఆప్షన్ ఉపయోగించాలని సూచించినప్పటికీ అక్కడ కూడా సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.

క్షేత్రస్థాయిలో పరిశీలించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్

జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ చంచల్‌గూడ, చావ్నీ ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేసిన ఆయన, ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తి చేసి ఓటర్లకు సమర్థవంతమైన సేవలు అందించాలని బీఎల్‌వోలు, పర్యవేక్షక అధికారులను ఆదేశించారు.Ghmc Rv2

ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న బీఆర్‌ఎస్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని బీఆర్‌ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ ఆరోపించారు. ఇప్పటికీ సగం మంది ఓటర్లకు కూడా ఎన్యూమరేషన్ ఫారాలు అందలేదని ఆయన అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఎల్‌వోలకు మూడేళ్లుగా జీతాలు చెల్లించకపోవడం వల్లే ప్రక్రియ ప్రభావితమైందని విమర్శించారు. గడువు కూడా తక్కువగా ఉండటంతో ఎస్‌ఐఆర్‌కు గడువు పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.

ఆన్‌లైన్‌లో ఇబ్బందులు: ఓటర్ల ఆవేదన

వెంకటేశ్వర కాలనీకి చెందిన సురేందర్ రెడ్డి మాట్లాడుతూ ఆధార్, ఓటరు కార్డులోని వివరాలు సరిపోక దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయని తెలిపారు. చిన్న స్పెల్లింగ్ తేడా లేదా స్పేస్ ఉన్నా నమోదు పూర్తి కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

గుల్‌మోహర్ పార్క్‌కు చెందిన రామకృష్ణ సాగర్ మాట్లాడుతూ ముందుగా ఓటర్ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతే ఎస్‌ఐఆర్‌ ప్రక్రియ సులభంగా పూర్తవుతోందని, నేరుగా దరఖాస్తు చేయాలంటే ఆధార్, ఫోటో, ఓటీపీ అప్‌లోడ్‌లో గందరగోళం ఎదురవుతోందన్నారు.

ప్రత్యేక పోర్టల్ ఉంటే సులభం

ఎస్‌ఐఆర్‌ దరఖాస్తుల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ లేదా ప్రత్యేక లింక్ అందుబాటులో ఉంటే సామాన్య ప్రజలు కూడా ఎవరి సహాయం లేకుండా ఫారాలు పూర్తి చేసే అవకాశం ఉంటుందని పలువురు సూచిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విధానాన్ని ఎన్నికల సంఘం మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చాలని ఓటర్లు కోరుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here