పాతబస్తీలో విద్యుత్ బిల్లుల చెల్లింపులు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు తీవ్రస్థాయిలో స్పందించారు. సోషల్ మీడియా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
పాతబస్తీలోని మైనారిటీలు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని, అందుకే వారికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నట్లుగా సీఎం మాట్లాడటాన్ని రాంచందర్ రావు తప్పుబట్టారు. నిబంధనల ఉల్లంఘన పేరుతో పేద హిందూ కుటుంబాల ఇళ్లను హైడ్రా కూల్చివేస్తున్నప్పుడు చూపని సానుభూతిని.. విద్యుత్ బిల్లులు చెల్లించని మైనారిటీల విషయంలో ఎందుకు చూపిస్తున్నారని ప్రశ్నించారు.
ఒకవైపు పేద, సామాన్య హిందూ కుటుంబాలపై హైడ్రాను ప్రయోగిస్తూ ఇబ్బందులకు గురిచేస్తూ.. మరోవైపు మైనారిటీల సంక్షేమం పేరుతో విద్యుత్ బిల్లుల చెల్లింపుపై సానుకూలంగా మాట్లాడటం కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిదర్శనమని ఆయన విమర్శించారు.
హిందువుల ప్రయోజనాలను పక్కనపెట్టి మైనారిటీలను ప్రసన్నం చేసుకునే బుజ్జగింపు రాజకీయాలు కాంగ్రెస్‌కు కొత్తేమీ కాదని రాంచందర్ రావు ఆరోపించారు. ఖిలాఫత్ ఉద్యమం కాలం నుంచి నేటి వరకు కాంగ్రెస్ విధానంలో ఎలాంటి మార్పు రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.






