Home తెలంగాణ భూ లక్ష్మి పథకంపై కవిత సంచలన ప్రకటన.. పేదలకు ఎకరం భూమి హామీ

భూ లక్ష్మి పథకంపై కవిత సంచలన ప్రకటన.. పేదలకు ఎకరం భూమి హామీ

14
0

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కీలక ప్రకటన చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి పథకం’ అమలు చేసి భూమి లేని పేద కుటుంబాలకు ఎకరం చొప్పున భూమిని కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భూమి అంటే వ్యాపార లావాదేవీలుగా కనిపించవచ్చని, కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ పేద మహిళలకు భూమి, అడవి పంచప్రాణాలతో సమానమని వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో చేపడుతున్న అనేక ప్రాజెక్టుల కోసం ముందుగా పేదల అసైన్డ్ భూములనే స్వాధీనం చేసుకుంటున్నారని కవిత ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటివరకు దాదాపు 30 వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కుందని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక న్యాయం పేరుతో ప్రజలను మోసం చేస్తోందని ఆరోపించిన ఆమె.. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం పేదల అసైన్డ్ భూములకు పూర్తి యాజమాన్య హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి ‘మేకవన్నె పులి’ లాంటి వారని, ఆయన చెప్పేది సామాజిక న్యాయం అయితే చేసేది ఆటవిక న్యాయమని తీవ్రస్థాయిలో విమర్శించారు. కేబినెట్ నియామకాల నుంచి ప్రభుత్వ సలహాదారులు, ఆర్టీఐ కమిషనర్ల ఎంపిక వరకు బడుగు, బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

కాంగ్రెస్ పాలనలో అగ్రవర్ణాలకు ఒక న్యాయం, పేదలకు మరో న్యాయం అమలవుతోందని కవిత మండిపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here