హైదరాబాద్ సనత్‌నగర్‌లో నిర్మించిన అత్యాధునిక టిమ్స్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆసుపత్రిని ప్రారంభించారు. ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసి పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం పేర్కొన్నారు.
రాష్ట్రంలో ప్రతి ఆరు నెలలకు ఒక ప్రధాన ఆసుపత్రిని ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించినట్లు రేవంత్ తెలిపారు. ఉస్మానియా ఆసుపత్రి పునర్నిర్మాణంతో పాటు ఎల్బీనగర్, అల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని చెప్పారు.
2027 డిసెంబర్ నాటికి రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో అదనంగా 10 వేల పడకలను అందుబాటులోకి తీసుకురావడం లక్ష్యమని సీఎం ప్రకటించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.
గత ప్రభుత్వం టిమ్స్ ఆసుపత్రులకు శంకుస్థాపనలు మాత్రమే చేసిందని, తమ ప్రభుత్వం వాటిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 32 నెలల్లో ప్రజారోగ్యంపై రూ.21,800 కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు.
వైద్యం, విద్యపై చేసే ఖర్చును భవిష్యత్ తరాలకు పెట్టుబడిగా భావిస్తున్నామని సీఎం అన్నారు. సూపర్ స్పెషాలిటీ వైద్యులు, అదనపు సమయం పనిచేసే సిబ్బందికి ప్రోత్సాహకాలు కల్పిస్తామని చెప్పారు. నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చి విదేశాల్లో ఉపాధి అవకాశాలు పెంచే చర్యలు చేపడతామని వెల్లడించారు.
కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు దామోదర రాజనరసింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ‘టీజీ సేఫ్’, ‘ఆరోగ్య దీపిక’ పాలిక్లినిక్‌లను సీఎం వర్చువల్‌గా ప్రారంభించారు.






