మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. మనీలాండరింగ్ కోణంలో విచారణ కొనసాగిస్తున్న ఈడీ.. శుక్రవారం హైదరాబాద్, కడప నగరాల్లోని ఏడు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. తనిఖీలు పూర్తయిన అనంతరం సోదాలకు సంబంధించిన వివరాలను ఈడీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించింది.
సోదాల్లో కేసుకు సంబంధించినవిగా భావిస్తున్న కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ తెలిపింది. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి సంబంధించిన ప్రాంగణాల్లో లెక్కల్లో చూపని రూ.24 లక్షల నగదుతో పాటు రెండు లాకర్ల తాళాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది.
సీబీఐ చార్జిషీట్, అప్రూవర్‌గా మారిన షేక్ దస్తగిరి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని హత్య కేసులోని ఆర్థిక లావాదేవీలపై ఈడీ పలు అంశాలను ప్రస్తావించింది. వివేకానందరెడ్డి హత్యకు రూ.40 కోట్లు చెల్లించేలా కుట్ర జరిగినట్లు దస్తగిరి వెల్లడించినట్లు ఈడీ పేర్కొంది.
అందులో తనకు రూ.5 కోట్లు ఇస్తామని టి. గంగిరెడ్డి హామీ ఇచ్చినట్లు దస్తగిరి చెప్పినట్లు ఈడీ తెలిపింది. అలాగే వై. సునీల్ యాదవ్ నుంచి దస్తగిరికి రూ.కోటి అందినట్లు, అందులో రూ.25 లక్షలను సునీల్ యాదవ్ వద్దే ఉంచుకుని, మిగిలిన రూ.75 లక్షలను తన స్నేహితుడు సయ్యద్ మున్నాకు ఇచ్చినట్లు వాంగ్మూలంలో పేర్కొన్నట్లు వివరించింది.
సయ్యద్ మున్నా, ఆయన తల్లి లాకర్ల నుంచి గతంలో సీబీఐ రూ.46.70 లక్షల నగదుతో పాటు లెక్కల్లో చూపని బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్న విషయాన్ని కూడా ఈడీ ప్రస్తావించింది.
2019 మార్చి 15న పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటికే పలు చార్జిషీట్లు దాఖలు చేసింది. వైఎస్ అవినాష్‌రెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, డి. శివశంకర్‌రెడ్డి, టి. గంగిరెడ్డి, వై. సునీల్ యాదవ్ తదితరులను నిందితులుగా పేర్కొన్నట్లు ఈడీ వెల్లడించింది.
Slug: ys-vivekananda-reddy-murder-case-ed-raids-kadapa-hyderabad






