Home తెలంగాణ రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

19
0

హైదరాబాద్: తెలంగాణలోని రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలం ప్రక్రియలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. వేలాన్ని నిలిపివేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఏవైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు సూచించింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.

తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TG-IIC) రాయదుర్గం పాన్ మక్తాలోని సుమారు 11 ఎకరాల భూమిని వేలం వేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో ఎకరాకు కనీస ధరను రూ.175 కోట్లుగా నిర్ణయించింది. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జువ్వాడి ప్రణయ సింహారావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

కంచ గచ్చిబౌలి భూములతో పోలిక

పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపించారు. గతంలో కంచ గచ్చిబౌలిలోని భూముల వేలాన్ని సుప్రీంకోర్టు నిలిపివేసిందని, ప్రస్తుతం ప్రభుత్వం రక్షిత భూములను వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.

అయితే తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ ఈ వాదనలను తీవ్రంగా ఖండించారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం వేలానికి ఉంచిన రాయదుర్గం భూములకు, గతంలో స్టే విధించిన కంచ గచ్చిబౌలి భూములకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

ఈ రెండు ప్రాంతాల మధ్య దాదాపు 5 కిలోమీటర్ల దూరం ఉందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన సుప్రీంకోర్టు పిటిషన్‌ను కొట్టివేసింది.

దీంతో రాయదుర్గం పాన్ మక్తా భూముల వేలం ప్రక్రియకు మార్గం సుగమమైంది. అయితే భూముల వేలంపై పిటిషనర్‌కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే హైకోర్టును ఆశ్రయించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here