తిరుమలలో శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ భారీ ఏర్పాట్లు చేస్తోంది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు.
సెప్టెంబర్ 15న బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. అనంతరం పెద్దశేష వాహన సేవలో పాల్గొంటారు. సెప్టెంబర్ 16న రిలయన్స్ సంస్థ విరాళంగా అందించిన 25 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం ప్రారంభించడంతో పాటు టీటీడీ 2027 క్యాలెండర్లు, డైరీలను ఆవిష్కరించనున్నారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి గరుడ సేవ రోజున భక్తుల రద్దీ 15 నుంచి 20 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగా ఏర్పాట్లను విస్తరిస్తోంది. రోజుకు 10 లక్షల లడ్డూలను బఫర్ స్టాక్‌గా సిద్ధం చేయనున్నారు.
అన్నప్రసాదం విషయంలోనూ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. గతేడాది 6.13 లక్షల భోజనాలు అందించగా.. ఈసారి ఏకంగా 9.30 లక్షల భోజనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే దాదాపు 52 శాతం పెంచుతున్నారు.
భద్రత కోసం 3 వేల మంది పోలీసులు, 2,500 మంది టీటీడీ విజిలెన్స్ సిబ్బందిని మోహరించనున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ కోసం అదనంగా 3,300 మంది సిబ్బందిని నియమిస్తున్నారు. తిరుపతి నగరంలో ప్రత్యేక హోల్డింగ్ పాయింట్లు, పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల ద్వారా భక్తులను తిరుమలకు తరలించనున్నారు.






