తుంగభద్ర జలాల వినియోగం, ఆర్డీఎస్ (రాజోలిబండ డైవర్షన్ స్కీమ్) సామర్థ్య పెంపు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం పురోగతిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రానికి కేటాయించిన నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు.
జలసౌధలో బుధవారం సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్ పథకాల ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. రాష్ట్రానికి ఆర్డీఎస్ ద్వారా 15 టీఎంసీల నీటి కేటాయింపు ఉన్నప్పటికీ ప్రస్తుతం 5 నుంచి 6 టీఎంసీలకు మించి వినియోగించుకోలేకపోతున్నామని అధికారులు సీఎంకు వివరించారు.
కాలువల్లో పూడిక పేరుకుపోవడం, నిర్మాణపరమైన సమస్యలు, నీటి ప్రవాహానికి ఆటంకాలు వంటి కారణాలతో పూర్తి స్థాయిలో నీటి వినియోగం సాధ్యం కావడం లేదని సమావేశంలో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో ఆర్డీఎస్ ఆయకట్టుకు దీర్ఘకాలిక సాగునీటి భద్రత కల్పించే ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సీఎం అధికారులను ఆదేశించారు.
తుమ్మిళ్ల లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్-2 పనులను వేగవంతం చేయడంతో పాటు మల్లమ్మకుంట రిజర్వాయర్ నిల్వ సామర్థ్యాన్ని 5 నుంచి 6 టీఎంసీలకు పెంచే అవకాశాలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు. అవసరమైతే అదనపు భూసేకరణపై నివేదిక సమర్పించాలని ఆదేశించారు.
అదేవిధంగా ఆర్డీఎస్ కాలువలో పూడిక తొలగింపు, హెడ్‌వర్క్స్ ఆధునీకరణ, ప్రత్యామ్నాయ ఎత్తిపోతల పథకాల రూపకల్పన, అంతర్రాష్ట్ర సమన్వయ వ్యవస్థలపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు.
కర్ణాటక, ఏపీతో చర్చలకు సన్నాహాలు
తుంగభద్ర పరీవాహక ప్రాంతంలో నీటి వినియోగం, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ అంశాలపై కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో పాటు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కేవలం కాగితాలపై నీటి కేటాయింపులు ఉండడం సరిపోదని, కేటాయించిన నీరు రైతుల పొలాలకు చేరేలా చర్యలు తీసుకోవడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు మల్లు రవి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, కార్యదర్శి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయ విమర్శలకు దారి తీసిన సమీక్ష
ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్ వ్యవహారంపై ప్రభుత్వ తాజా సమీక్ష రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. కర్ణాటక చేపడుతున్న ప్రాజెక్టుల కారణంగా తెలంగాణకు కేటాయించిన నీటి వాటాపై ప్రభావం పడుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
బీఆర్‌ఎస్ నాయకులు గతంలో తుమ్మిళ్ల లిఫ్ట్ ద్వారా చివరి ఆయకట్టు ప్రాంతాలకు నీరు అందిందని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పంపుల నిర్వహణ మందగించిందని విమర్శిస్తున్నారు. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నీటి వినియోగంపై మరింత కఠిన వైఖరి అవలంబించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అయితే ప్రభుత్వం మాత్రం ఆర్డీఎస్ సామర్థ్యాన్ని పెంచేందుకు సాంకేతిక, పరిపాలనా, అంతర్రాష్ట్ర సమన్వయ చర్యల ద్వారా పరిష్కార మార్గాలను అన్వేషిస్తున్నట్లు పేర్కొంటోంది.
