Home తెలంగాణ సీఐఐ సమావేశంలో చంద్రబాబును గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. పెట్టుబడులకు తెలంగాణే బెస్ట్!

సీఐఐ సమావేశంలో చంద్రబాబును గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. పెట్టుబడులకు తెలంగాణే బెస్ట్!

1
0

హైదరాబాద్‌లో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) నార్తర్న్ రీజనల్ కౌన్సిల్ ప్రతినిధుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత సురక్షితమైన, పెట్టుబడిదారులకు అనుకూలమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన తెలిపారు.

సమావేశంలో మాట్లాడుతూ, “నాయకులు, పార్టీలు మారినా గత ప్రభుత్వాలు చేపట్టిన మంచి కార్యక్రమాలను కొనసాగించడం ప్రభుత్వ బాధ్యత” అని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని పీవీ నరసింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను ప్రశంసించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్, బిల్ క్లింటన్ వంటి అంతర్జాతీయ ప్రముఖులను హైదరాబాద్‌కు తీసుకువచ్చి పెట్టుబడులను ఆకర్షించిన విషయాన్ని గుర్తు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు రూపుదిద్దుకోవడంతో హైదరాబాద్ ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించిందని సీఎం తెలిపారు. ఈ అభివృద్ధి ఫలితంగానే ఫార్మా, ఐటీ, సేవారంగాలు వేగంగా విస్తరించాయని చెప్పారు.

పొరుగు రాష్ట్రాలతో పోటీ పడటం తమ లక్ష్యం కాదని, తయారీ రంగంలో చైనా, జపాన్, జర్మనీ వంటి ప్రపంచ దేశాలతో పోటీ పడే స్థాయికి తెలంగాణను తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. టోక్యో, న్యూయార్క్ వంటి అంతర్జాతీయ నగరాలతో హైదరాబాద్ పోటీ పడేలా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయాలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, అలాగే కేంద్రం ప్రతిపాదించిన ఏడు బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో మూడు తెలంగాణకు రానున్నాయని వెల్లడించారు. శంషాబాద్ నుంచి చెన్నై, పుణే, బెంగళూరు వరకు బుల్లెట్ రైలు మార్గాలు రాష్ట్ర అభివృద్ధికి మరింత ఊతమిస్తాయని చెప్పారు.

రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని పేర్కొన్న సీఎం, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ల (GCC) ఏర్పాటుకు సుమారు 200 కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. అమెజాన్ రూ.1 లక్ష కోట్లు, అదానీ గ్రూప్ రూ.35 వేల కోట్ల పెట్టుబడులతో డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయని వెల్లడించారు. ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీలో ప్రపంచంలోని 500 ప్రముఖ కంపెనీలను తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here