Home తెలంగాణ హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై వరద.. గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్!

హైదరాబాద్‌ను ముంచెత్తిన భారీ వర్షం.. రోడ్లపై వరద.. గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్!

3
0

భాగ్యనగరాన్ని భారీ వర్షం అతలాకుతలం చేసింది. మంగళవారం సాయంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కుండపోత వర్షం కురిసింది. ఒక్కసారిగా భారీ వర్షం పడటంతో నగరంలోని ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

సాయంత్రం ఆఫీసులు ముగిసే సమయం కావడంతో వర్షం ప్రభావం ట్రాఫిక్‌పై తీవ్రంగా పడింది. ప్రధాన రహదారులపై వాహనాలు భారీగా నిలిచిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది.

నగరమంతా భారీ వర్షం

రాజేంద్రనగర్‌లో ప్రారంభమైన వర్షం క్రమంగా నగరంలోని అనేక ప్రాంతాలకు విస్తరించింది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, ఫిల్మ్‌నగర్‌, ఖైరతాబాద్‌, లక్డీకాపూల్‌, నాంపల్లి, కోఠి, బేగంపేట్‌, సికింద్రాబాద్‌, మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్‌, హైటెక్‌సిటీ, కొంపల్లి, ఓల్డ్‌సిటీ, అంబర్‌పేట్‌, కాచిగూడ, మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌నగర్‌, చైతన్యపురి, కొత్తపేట, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, హయత్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది.

పలు ప్రాంతాల్లో డ్రైనేజీలు పొంగిపొర్లగా.. లోతట్టు ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరదనీరు చేరింది. ముషీరాబాద్‌లో అత్యధికంగా 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది.

ట్రాఫిక్‌ అస్తవ్యస్తం

భారీ వర్షానికి మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ తీవ్రంగా స్తంభించింది. కిలోమీటర్‌ దూరం ప్రయాణించేందుకు 15 నుంచి 20 నిమిషాల సమయం పట్టినట్లు వాహనదారులు తెలిపారు.

చాదర్‌ఘాట్‌ నుంచి మలక్‌పేట్‌ రైల్వే అండర్‌పాస్‌ వరకు నీరు నిలిచిపోవడంతో రాకపోకలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఎస్‌ఆర్‌నగర్‌ ఆర్‌యూబీ వద్ద కూడా నీరు నిలిచిపోవడంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. హైదర్‌గూడ పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఫ్లైఓవర్‌ కింద నీరు చేరడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. కోఠిలో ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్‌ కూడా చిక్కుకుంది.

మెట్రోను ఆశ్రయించిన ప్రయాణికులు

రోడ్లపై ట్రాఫిక్‌ జామ్‌ కారణంగా పలువురు ప్రయాణికులు మెట్రో రైళ్లను ఆశ్రయించారు. దీంతో మెట్రో స్టేషన్లు, రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి.

ఈదురుగాలుల కారణంగా పలు ప్రాంతాల్లో చెట్ల కొమ్మలు విరిగి రోడ్లపై పడటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది.

ప్రజలకు ట్రాఫిక్‌ పోలీసుల హెచ్చరిక

భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు. అత్యవసర పని ఉంటే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. ప్రయాణం తప్పనిసరి అయితే వాహనాలను నెమ్మదిగా నడపాలని సూచించారు.

డీఆర్‌ఎఫ్‌, మాన్‌సూన్‌ టీమ్స్‌, ట్రాఫిక్‌ పోలీసులు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. నీరు నిలిచిన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపడుతూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించే ప్రయత్నం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here