రాష్ట్ర ఆదాయ వృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు, వివిధ శాఖల్లో జరుగుతున్న అక్రమాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లుతోందని అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి ప్రతిపాదించినట్లు సమాచారం.
ఈ కొత్త విభాగం ద్వారా వాణిజ్య పన్నులు, గనులు, పౌర సరఫరాలు, ఎక్సైజ్, స్టాంపులు & రిజిస్ట్రేషన్ వంటి కీలక శాఖల్లో అవినీతి, అక్రమాలను నియంత్రించేందుకు సమగ్ర నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వేర్వేరు శాఖల్లో ఉన్న తనిఖీ వ్యవస్థల స్థానంలో అన్ని శాఖలను పర్యవేక్షించే ఒకే ఎన్‌ఫోర్స్‌మెంట్ యంత్రాంగం పనిచేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
అయితే, ఈ ప్రతిపాదనపై రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చ సాగుతోంది. ఒకే నిఘా వ్యవస్థ ఏర్పాటుతో సంబంధిత శాఖలపై ఆయా మంత్రుల ప్రత్యక్ష పట్టు తగ్గే అవకాశం ఉందని, పరిపాలనా వ్యవస్థ మరింతగా ముఖ్యమంత్రి కార్యాలయం ఆధ్వర్యంలో కేంద్రీకృతమయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ సంస్థ ఏర్పాటు, దాని అధికార పరిధి, విధివిధానాలపై ప్రభుత్వం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
