మేడ్చల్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి లైబ్రరీ వరకు రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన మేడ్చల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్‌కు బీజేపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం స్థానికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, గిర్మాపూర్ బీజేపీ నాయకులు గత కొంతకాలంగా ఈ రోడ్డు నిర్మాణం కోసం సంబంధిత అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించడంతో పాటు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల తరఫున నిరంతరం పోరాటం చేశారని తెలిపారు.
ఈ సమస్యను పరిష్కరించేందుకు మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ కూడా పలుమార్లు అధికారులతో మాట్లాడి వారి దృష్టికి తీసుకెళ్లారని గుర్తుచేశారు. అలాగే ఏప్రిల్ 13న నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రోడ్డు నిర్మాణంపై మరోసారి వినతిపత్రం అందజేయగా అధికారులు సానుకూలంగా స్పందించి నిధుల మంజూరు ప్రక్రియను ప్రారంభించినట్లు పేర్కొన్నారు.
బీజేపీ నాయకుల నిరంతర కృషి, ప్రజల తరఫున సాగించిన పోరాటం ఫలితంగానే ఈ అభివృద్ధి పనులు ముందుకు వచ్చాయని వారు అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం కొందరు కాంగ్రెస్ నాయకులు ఈ పనులను తమ ఘనతగా ప్రచారం చేసుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని ఆరోపించారు. ఈ సమస్య పరిష్కారం కోసం ఎవరు నిరంతరం కృషి చేశారో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు.
రోడ్డు సమస్యతో పాటు డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, అంగన్వాడీ కేంద్రాలు, పారిశుద్ధ్యం వంటి ప్రజా సమస్యలపై కూడా బీజేపీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు.
“ప్రజల సమస్యే బీజేపీ సమస్య.. ప్రజల సంక్షేమమే మా లక్ష్యం. అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన నిలబడి సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే వరకు పోరాటం కొనసాగిస్తాం” అని బండి విష్ణు గౌడ్, శ్రీపాల్ రెడ్డి, రాఘవ రెడ్డి తెలిపారు
