గతేడాది జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ ప్రమేయం ఉన్నట్లు సూచించే కీలక ఆధారాలు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ)కు లభించినట్లు తెలుస్తోంది. ఉగ్రవాదుల కమ్యూనికేషన్ వ్యవస్థలు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన అధికారులు పాకిస్థాన్‌కు చెందిన సంస్థలు, బ్యాంకులతో సంబంధాలను గుర్తించినట్లు సమాచారం.
దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్ల డేటా, కాల్ రికార్డులు, డిజిటల్ కమ్యూనికేషన్ వివరాలను విశ్లేషించిన ఎన్‌ఐఏ అధికారులు కీలక విషయాలను వెలికితీశారు. ఉగ్రవాదులు ఉపయోగించిన షావోమీ 9టీ, నోట్ 12 మొబైల్ ఫోన్లలో ఒకదాన్ని కరాచీకి చెందిన ‘టెక్ సిరత్ ప్రైవేట్ లిమిటెడ్’ సంస్థ 2021లో దిగుమతి చేసుకున్నట్లు గుర్తించారు.
ఈ ఫోన్ దిగుమతికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని పాకిస్థాన్‌లోని ఫైసల్ బ్యాంక్ అందించినట్లు విచారణలో తేలినట్లు సమాచారం. దీంతో ఈ కేసులో పాకిస్థాన్‌కు చెందిన సంస్థల పాత్రపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
ఇదిలా ఉండగా, గతంలోనూ పలు ఉగ్రవాద కార్యకలాపాల విచారణల్లో ఫైసల్ బ్యాంక్ పేరు ప్రస్తావనకు వచ్చినట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. 2007లో ఒక అమెరికన్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం, పాకిస్థాన్‌కు చెందిన రెండు ఉగ్రసంస్థలు తమ డిపాజిట్లను ఈ బ్యాంక్‌లో నిర్వహిస్తున్నట్లు వెల్లడైంది.
మరోవైపు, పహల్గామ్ దాడిలో ఉపయోగించిన రెండు మొబైల్ ఫోన్లు 2021, 2023 సంవత్సరాల్లో దిగుమతి అయినప్పటికీ, దాడి జరిగే వరకు వాటిని ఎక్కడా ఉపయోగించలేదని దర్యాప్తులో తేలింది. ఈ ఫోన్లను ప్రత్యేకంగా ఉగ్రదాడి కోసం సిద్ధంగా ఉంచి, చివరి క్షణంలో ఉగ్రవాదులకు అందజేసి ఉండవచ్చని ఎన్‌ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు.
పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఈ తాజా ఆధారాలు దర్యాప్తును కీలక మలుపు తిప్పే అవకాశం ఉందని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి.
