తెలంగాణ ప్రభుత్వం బీసీ గురుకుల విద్యార్థులకు మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలోని బీసీ గురుకుల విద్యాసంస్థల్లో చదివి ఐఐటీ, ఐఐఐటీ, ఎన్‌ఐటీ వంటి ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్‌లు అందించాలని నిర్ణయించింది.
ఈ మేరకు బీసీ గురుకుల సొసైటీ 6వ బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షత వహించగా, పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఇంటర్ విద్యాశాఖ అధికారులు, ఈడబ్ల్యూఐడీసీ, నవోదయ విద్యాలయ సమితి, గురుకుల సొసైటీ ప్రతినిధులు హాజరయ్యారు.
విద్యార్థి మరణిస్తే రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా
బీసీ గురుకుల విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థి మరణిస్తే, అతని కుటుంబానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గురుకుల పాఠశాలలకు కంప్యూటర్లు, జూనియర్ కళాశాలలకు ఆధునిక ఇంటరాక్టివ్ ప్యానెల్‌లను ఏర్పాటు చేయనున్నారు.
అదే విధంగా గురుకుల సొసైటీ ఆధ్వర్యంలోని వ్యవసాయ కళాశాలలో బీసీ గురుకుల విద్యార్థులకు ప్రత్యేక ప్రవేశాలు కల్పించనున్నారు.
గురుకుల సొసైటీ పేరులో మార్పు
ఇప్పటి వరకు “మహాత్మా జ్యోతిబా ఫులే గురుకుల సొసైటీ”గా ఉన్న పేరును “తెలంగాణ వెనకబడిన తరగతుల సంక్షేమ మహాత్మా జ్యోతిరావు ఫులే విద్యాసంస్థల సొసైటీ”గా మార్చేందుకు బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది.
అలాగే రాష్ట్రంలో 12 సైనిక పాఠశాలల ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలపై నివేదిక తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.
నవంబర్ నాటికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్‌ఫాస్ట్
ప్రస్తుతం ప్రీ-ప్రైమరీ పాఠశాలల పనివేళలను పెంచే అంశాన్ని పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. మరోవైపు ఇప్పటికే ప్రారంభించిన బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని దశలవారీగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించాలని నిర్ణయించింది. నవంబర్ నాటికి 100 శాతం పాఠశాలల్లో ఈ పథకం అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
అదనంగా కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్న పాఠశాలల్లో ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్ల నియామకానికి కూడా ప్రభుత్వం ఆమోదం తెలిపింది.






