హైదరాబాద్: మహిళల ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు డీమార్ట్ తరహాలో సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
‘మహిళా శక్తి సూపర్ బజార్లు’ పేరుతో ఈ సూపర్ మార్కెట్లను మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. నిత్యావసర సరుకులతో పాటు గృహావసర వస్తువులు, వివిధ ఉత్పత్తులను వినియోగదారులకు తక్కువ ధరలకు అందుబాటులో ఉంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు.
ఈ ప్రాజెక్టును ఒకేసారి రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దశలవారీగా అమలు చేయనున్నారు. తొలి విడతలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్, సంగారెడ్డి వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒక్కో సూపర్ బజార్‌ను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.
ఖమ్మం జిల్లాలో ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి, ఫలితాల ఆధారంగా మిగతా జిల్లాలకు విస్తరించనున్నారు. సమర్థవంతంగా పనిచేస్తున్న మహిళా సంఘాలను ఈ ప్రాజెక్టు నిర్వహణకు ఎంపిక చేయనుండగా, అవసరమైన స్థలాలను ప్రభుత్వం కేటాయించనుంది. జనసాంద్రత అధికంగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.
అంతేకాకుండా మహిళా సంఘాల కోసం లాజిస్టిక్స్ హబ్‌లు, ఆధునిక రైస్ మిల్లుల ఏర్పాటుపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. మహిళలను ఉద్యోగార్థులుగా కాకుండా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాలను అమలు చేయనుంది.
ఇక వ్యాపారాలు ప్రారంభించాలనుకునే మహిళలకు వడ్డీ లేని రుణాలను కూడా ప్రభుత్వం అందిస్తూ, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం కల్పిస్తోంది.
