Home తెలంగాణ కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి.. ప్రతిపక్షంగా ఘోరంగా విఫలమయ్యారు: సీఎం రేవంత్‌రెడ్డి

కేసీఆర్ వెంటనే రాజీనామా చేయాలి.. ప్రతిపక్షంగా ఘోరంగా విఫలమయ్యారు: సీఎం రేవంత్‌రెడ్డి

9
0

తెలంగాణలో ప్రభుత్వం కంటే ప్రతిపక్షమే తన బాధ్యతలను నిర్వర్తించడంలో ఘోరంగా విఫలమైందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ తన బాధ్యతలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. ప్రజలకు అందుబాటులో లేని కేసీఆర్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

హైదరాబాద్‌ మూసారాంబాగ్‌ వద్ద రూ.52 కోట్లతో నిర్మించిన హైలెవల్‌ వంతెనను సోమవారం సీఎం ప్రారంభించారు. అనంతరం అంబర్‌పేటలో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు.

గత వెయ్యి రోజులుగా కేసీఆర్ ఎమ్మెల్యేగా జీతం, ఇతర సదుపాయాల రూపంలో రూ.22 కోట్లకు పైగా ప్రజాధనాన్ని తీసుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. అయితే ప్రజల సమస్యల కోసం ఒక్కరోజు కూడా బయటకు రాలేదని విమర్శించారు.

ప్రజల సొమ్మును తీసుకుంటూ ఫాంహౌస్‌లో ఉంటే సరిపోతుందా? అంటూ కేసీఆర్‌పై సీఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వెయ్యి రోజులుగా ప్రజలకు ముఖం చూపించని ప్రతిపక్ష నేత దేశంలో మరెవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. తాను ఈ కాలంలో ఒక్క గంట కూడా సెలవు తీసుకోలేదని, కేసీఆర్ మాత్రం ప్రజలకు ఒక్క గంట కూడా సమయం కేటాయించలేదని అన్నారు.

కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నుంచి 6వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ 7న ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకైనా కేసీఆర్ హాజరై ప్రజా సమస్యలపై మాట్లాడాలని సూచించారు.

కేసీఆర్ కుటుంబ సభ్యులకే పదవులు ఇచ్చారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. తాను మాత్రం కుటుంబానికి కాకుండా పార్టీ కోసం కష్టపడిన వారికి పదవులు ఇచ్చానని తెలిపారు.

అంబర్‌పేటలో 10 ఎకరాల్లో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్లకు కొత్త లోగోలను ఆవిష్కరించారు. రాష్ట్ర పాలనా వ్యవస్థను గాడిలో పెట్టామని, ఇకపై పాలన మరింత సాఫీగా సాగుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here