State Bank of India (ఎస్బీఐ) నిర్లక్ష్యానికి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్ గట్టి హెచ్చరిక పంపింది. ఖాతాదారుడు సమర్పించిన అసలు ఆస్తి పత్రాలను భద్రపరచడంలో విఫలమైన బ్యాంకు, బాధితుడికి రూ.3 లక్షల నష్టపరిహారం, రూ.20 వేల వ్యాజ్య ఖర్చులు చెల్లించాలని కమిషన్ స్పష్టం చేసింది.
బొంగులూరుకు చెందిన బి. వెంకటేశం గృహ రుణం కోసం ఆదిభట్ల ఎస్బీఐ బ్రాంచ్‌లో తన బంధువుకు చెందిన ప్లాట్‌కు సంబంధించిన ఒరిజినల్ సేల్ డీడ్, ఇతర కీలక పత్రాలను బ్యాంకులో డిపాజిట్ చేశారు. రుణాన్ని పూర్తిగా చెల్లించిన తర్వాత పత్రాలు తిరిగి ఇవ్వాలని కోరినా బ్యాంకు అధికారులు పలుమార్లు వివిధ కారణాలు చెబుతూ ఆలస్యం చేశారు.
చివరికి అసలు పత్రాలు కనిపించడం లేదని బ్యాంకు వెల్లడించడంతో వెంకటేశం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బ్యాంకు సర్టిఫైడ్ కాపీలు మాత్రమే ఇవ్వడంతో అసలు పత్రాల విలువ కోల్పోయినట్లు భావించిన బాధితుడు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
విచారణ సందర్భంగా పత్రాల గల్లంతుపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, ప్రత్యామ్నాయ పత్రాల కోసం చర్యలు తీసుకున్నామని ఎస్బీఐ వాదించినప్పటికీ కమిషన్ అంగీకరించలేదు. రుణ భద్రత కోసం సమర్పించిన పత్రాలను కాపాడాల్సిన బాధ్యత పూర్తిగా బ్యాంకుదేనని స్పష్టం చేస్తూ బాధితుడికి నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది.





