Home తెలంగాణ ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్లకు లక్కీ డ్రా.. 28 నుంచి 31 వరకు కేటాయింపులు

ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్లకు లక్కీ డ్రా.. 28 నుంచి 31 వరకు కేటాయింపులు

20
0

హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్‌) పరిధిలో పేదలకు సొంతింటి కలను నెరవేర్చేందుకు నిర్మిస్తున్న ఇందిరమ్మ టవర్స్‌ ఫ్లాట్ల కేటాయింపునకు ప్రభుత్వం సిద్ధమైంది. అర్హులైన లబ్ధిదారుల సమక్షంలోనే లక్కీ డ్రా నిర్వహించి ఫ్లాట్లను కేటాయించనున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్‌ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

సచివాలయంలో హౌసింగ్‌ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష అనంతరం మంత్రి వివరాలు వెల్లడించారు. ఆగస్టు 28 నుంచి 31 వరకు వివిధ ప్రాంతాల్లో లక్కీ డ్రా నిర్వహించనున్నట్లు తెలిపారు.

తొలి విడతలో 15 నియోజకవర్గాల్లో రూ.807.40 కోట్ల అంచనా వ్యయంతో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణం చేపడుతున్నామని, టెండర్ల ప్రక్రియ పూర్తయిందని మంత్రి చెప్పారు. మొత్తం 60,720 దరఖాస్తులు రాగా.. పరిశీలన అనంతరం 40,900 మందిని అర్హులుగా, 19,820 మందిని అనర్హులుగా గుర్తించినట్లు తెలిపారు. అనర్హతకు సంబంధించిన కారణాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు.

ఎంపిక కాని దరఖాస్తుదారులకు రూ.10 వేల ఈఎండీ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.

లక్కీ డ్రా షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 28న కౌకూర్, పాటిగడ్డ, జల్‌పల్లి, కుల్సుంపురలో.. 29న జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే కాలనీ, బోయిన్‌పల్లిలో.. 30న గాజులరామారం, అంబర్‌పేటలో.. 31న రాయదుర్గం, కేపీహెచ్‌బీ కాలనీలలో డ్రా నిర్వహించనున్నారు.

ఇక మరో నాలుగు నియోజకవర్గాల్లో కొత్తగా ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి స్థలాలను ఎంపిక చేసినట్లు పొంగులేటి తెలిపారు. ఎల్‌బీనగర్‌, గోషామహల్‌, ముషీరాబాద్‌, చాంద్రాయణగుట్ట నియోజకవర్గాల్లో మొత్తం 1,920 ఇళ్లను నిర్మించనున్నట్లు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here