తెలంగాణలో ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల నియామక ప్రక్రియలో ట్రాన్స్‌జెండర్లకు అవకాశం కల్పించకపోవడంపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. దరఖాస్తు ఫారంలో స్త్రీ, పురుష లింగాలతో పాటు ‘ఇతరులు’ అనే కాలమ్‌ను ఎందుకు చేర్చలేదని ప్రభుత్వాన్ని, రాష్ట్రస్థాయి పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డును ప్రశ్నించింది. ట్రాన్స్‌జెండర్ల నుంచి కూడా దరఖాస్తులు స్వీకరించాలని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు జారీచేసిన నోటిఫికేషన్లలో తమకు అవకాశం కల్పించలేదని సూర్యాపేట జిల్లాకు చెందిన డి.తనుశ్రీ, మరికొందరు ట్రాన్స్‌జెండర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్‌కుమార్ సింగ్, జస్టిస్ మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్. రవిచందర్ వాదిస్తూ, అన్ని రంగాల్లో ట్రాన్స్‌జెండర్లకు సమాన అవకాశాలు కల్పించాలని గతంలోనే హైకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తుచేశారు.






