2019-2024 మధ్య కాలంలో తెలంగాణ అభివృద్ధి పథంలో పయనించగా, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు తలొగ్గి జగన్ రాష్ట్ర ప్రయోజనాలకు తీవ్ర ద్రోహం చేశారని ఆయన విమర్శించారు.
జగన్ తన ఐదేళ్ల పాలనలో ఏకంగా 102 ప్రాజెక్టుల టెండర్లను రద్దు చేసి అభివృద్ధిని వెనక్కి నెట్టారని, ఆయన హయాంలో జరిగిన అరాచకాలు, దోపిడీని ప్రజలు ఇంకా మర్చిపోలేదని మండిపడ్డారు. చట్టసభలు, అసెంబ్లీ సమావేశాలకు జగన్ హాజరుకాకుండా కేవలం ప్రెస్‌మీట్‌లకే పరిమితం కావడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడే జగన్, తన పాలనలో రైతులకు అసలు ఏం మేలు చేశారో చెప్పాలని నిలదీశారు.
సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణలో తమ కూటమి ప్రభుత్వానికి, జగన్ పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని వివరిస్తూ… తమ ప్రభుత్వంలో రాయలసీమ ప్రాజెక్టుల కోసం రూ.13,500 కోట్లు ఖర్చు చేయగా, జగన్ తన ఐదేళ్ల కాలంలో వెలుగొండ ప్రాజెక్టుకు కేవలం రూ.800 కోట్లు మాత్రమే వెచ్చించారని ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ‘ఎల్‌నినో’ ప్రభావం ఉన్నప్పటికీ, ఇలాంటి ప్రకృతి విపత్తులను సమర్థంగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలిచిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని కొల్లు రవీంద్ర కొనియాడారు.






