Home తెలంగాణ హెచ్‌ఐవీపై పోరులో కీలక ముందడుగు.. లెనాకాపవిర్ జెనరిక్‌కు భారత్‌లో గ్రీన్ సిగ్నల్

హెచ్‌ఐవీపై పోరులో కీలక ముందడుగు.. లెనాకాపవిర్ జెనరిక్‌కు భారత్‌లో గ్రీన్ సిగ్నల్

11
0

హెచ్‌ఐవీ నివారణలో కీలకంగా భావిస్తున్న ‘లెనాకాపవిర్’ జెనరిక్ ఇంజెక్షన్‌కు భారత్‌లో గ్రీన్ సిగ్నల్ లభించింది. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌తో పాటు ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ ఈ ఔషధాన్ని దేశంలో తయారు చేసి మార్కెటింగ్ చేసేందుకు సీడీఎస్‌సీవో నిపుణుల కమిటీ అనుమతి ఇచ్చింది.

మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లేకుండానే ఉత్పత్తి, మార్కెటింగ్‌కు అనుమతి లభించడం ఈ నిర్ణయంలో కీలక అంశంగా మారింది. అయితే ఔషధం మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫేజ్-4 క్లినికల్ పరీక్షలు నిర్వహించి, సంబంధిత డేటాను సమర్పించాలని కంపెనీలకు ఆదేశాలు జారీ చేశారు.

హెచ్‌ఐవీ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఏడాదికి రెండుసార్లు ఈ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. కనీసం 35 కిలోల బరువు ఉన్న వారికి ఇది వర్తిస్తుంది.

లెనాకాపవిర్‌కు గిలీడ్ సైన్సెస్ పేటెంట్ హక్కులు కలిగి ఉంది. భారత్‌తో పాటు 120 అల్పాదాయ దేశాల్లో ఈ ఔషధాన్ని తయారు చేసేందుకు పలు సంస్థలకు రాయల్టీ లేకుండా లైసెన్సులు ఇవ్వడంతో జెనరిక్ వెర్షన్ అందుబాటులోకి వస్తోంది.

ప్రస్తుతం అమెరికా, ఈయూ దేశాల్లో ఈ ఔషధానికి ఏడాదికి రూ.27 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు వ్యయం అవుతున్నట్లు సమాచారం. జెనరిక్ ఔషధం భారత్‌లో అందుబాటులోకి వస్తే ధర 50-70 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో డాక్టర్ రెడ్డీస్ అనుబంధ సంస్థ ఆరిజెన్ ఫార్మాకు మరో కీలక ఒప్పందం దక్కింది. ఓ అంతర్జాతీయ ఫార్మా సంస్థతో కుదిరిన ఒప్పందం ప్రకారం స్టెరైల్ ఇంజెక్టబుల్స్, బయోలాజిక్స్‌ను దీర్ఘకాలం పాటు తయారు చేసి సరఫరా చేయనుంది. ఒప్పందంలోని గోప్యతా నిబంధనల కారణంగా భాగస్వామ్య సంస్థ పేరును వెల్లడించలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here