Home జాతీయం “తెలంగాణకు ద్రోహం”.. శ్రీశైలం విద్యుత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

“తెలంగాణకు ద్రోహం”.. శ్రీశైలం విద్యుత్‌పై కేటీఆర్ సంచలన ఆరోపణలు

0

శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపివేయాలన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఆదేశాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఈ నిర్ణయం తెలంగాణ ప్రయోజనాలకు పెద్ద దెబ్బ అని ఆయన ఆరోపించారు.

ఎల్‌నినో పేరుతో తెలంగాణ హక్కులను కేఆర్ఎంబీ కాలరాస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని కేటీఆర్ నిలదీశారు. ఏపీ ప్రభుత్వం వెలిగొండ ప్రాజెక్టుకు ఏ నిబంధనల ప్రకారం నీటిని తరలిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు.

“ఏపీ నీటి తరలింపు బోర్డు కళ్లకు కనిపించడం లేదా?” అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణలో మాత్రం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పంపులను మూసివేసి ఏపీకి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తోందని ఆరోపించారు.

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతే నాగార్జున సాగర్ ఎడమ కాలువతో పాటు కల్వకుర్తి, జూరాల, నెట్టెంపాడు, భీమా ఎత్తిపోతల పథకాలపై ఆధారపడే రైతులు తీవ్రంగా నష్టపోతారని కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇక శ్రీశైలం నీటి నిల్వలపై కూడా కేటీఆర్ కీలక ప్రశ్నలు సంధించారు. ఆగస్టు 21న 169 టీఎంసీలుగా ఉన్న నీటి నిల్వలు 15 రోజుల్లోనే 139 టీఎంసీలకు తగ్గాయని, ఈ సమయంలో 30 టీఎంసీల నీరు ఎలా తగ్గిపోయిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

కల్వకుర్తి వద్ద కేవలం మూడు మోటార్లు మాత్రమే నడుస్తున్నాయని పేర్కొన్న కేటీఆర్.. తెలంగాణ రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు.

NO COMMENTS

LEAVE A REPLY Cancel reply

Please enter your comment!
Please enter your name here

Exit mobile version