TGN NEWS (రామచంద్రపురం): బిఆర్‌ఎస్ పార్టీ తలపెట్టిన “ఛలో బస్ భవన్” కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం, పోలీసులు కఠిన చర్యలకు దిగారు. పటాన్‌చెరు నియోజకవర్గ బిఆర్‌ఎస్ ఇన్‌చార్జి వి. ఆదర్శ్ రెడ్డి నివాసాన్ని పోలీసులు ఉదయం చుట్టుముట్టి హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ —“శాంతియుతంగా జరగాల్సిన ప్రజా కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్య హక్కులను ఉల్లంఘించింది. పెంచిన చార్జీలపై ప్రజలకు సమాధానం చెప్పలేని ప్రభుత్వమే ఈ విధమైన అణచివేత చర్యలకు దిగుతోంది,” అని ఆయన విమర్శించారు. అదే సమయంలో, “ఛలో బస్ భవన్” ఉద్యమం ప్రజల వాణిని వినిపించేందుకు, ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడానికేనని స్పష్టం చేశారు.“పోలీసుల హౌస్ అరెస్ట్‌తో తాము వెనక్కి తగ్గబోము. ప్రజా హక్కుల కోసం బిఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుంది,” అని ఆదర్శ్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో పరమేశ్ యాదవ్, యూనుస్, మాణిక్ యాదవ్, శ్రీకాంత్, నర్సింగ్, జైపాల్, షకీల్ తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు.