అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాల కారణంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. మరో 24 గంటలపాటు కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు చర్యలు చేపడుతున్నారు.
హైదరాబాద్‌లో సోమవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలపై హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, హైడ్రా, విద్యుత్, పోలీస్, రెవెన్యూ తదితర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని తెలుసుకున్నారు.
వర్షపు నీరు నిలిచిపోయే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఏ శాఖకు సంబంధించిన సమస్య అయినా ఇతర శాఖలతో సమన్వయం చేసుకుంటూ తక్షణమే పరిష్కరించాలని సూచించారు.
జంట జలాశయాలపై నిఘా
వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాల అవకాశాల నేపథ్యంలో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ క్యాచ్‌మెంట్ ప్రాంతాలను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి తెలిపారు.
జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరి గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడితే ముందుగానే సంబంధిత శాఖలకు సమాచారం అందించాలని సూచించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
గణేష్ ఉత్సవాల నేపథ్యంలో ప్రత్యేక చర్యలు
వినాయక చవితి ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో వర్షాల ప్రభావం గణేష్ మండపాలు, నిమజ్జన ప్రాంతాలపై పడకుండా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. మండపాల వద్ద విద్యుత్, నీటి నిల్వ, రహదారి పరిస్థితులను పరిశీలించాలని, నిమజ్జన ప్రాంతాల్లో భద్రతా చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు.
నాలాల పూడికపై మంత్రి ఆగ్రహం
వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని మంత్రి స్పష్టం చేశారు. మ్యాన్‌హోల్స్, నాలాలు, డ్రైనేజీ ప్రాంతాల్లో డీ-సిల్టింగ్ సందర్భంగా బయటకు తీసిన పూడిక, మట్టి, ఇతర డెబ్రిస్‌ను రోడ్లపై లేదా నాలాల పక్కన వదిలివేయకుండా వెంటనే తరలించాలని ఆదేశించారు.
వర్షం కురిసిన సమయంలో ఈ వ్యర్థాలు తిరిగి నాలాల్లోకి చేరితే నీటి ప్రవాహం నిలిచిపోయి జలమయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
ఎమర్జెన్సీ బృందాలు సిద్ధం
మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్‌తో పాటు ఎయిర్‌టెక్ యంత్రాలను అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ఆలస్యం లేకుండా స్పందించేలా సిబ్బంది, పరికరాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.
అధికారులు కార్యాలయాల్లో కూర్చొని సమీక్షలకు మాత్రమే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా వర్షాల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించి అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని ఆదేశించారు.






