హైదరాబాద్: సామాజిక సేవలో చురుగ్గా పాల్గొంటూ గుర్తింపు పొందిన హైదరాబాద్ యువకుడు విజయ్‌రెడ్డి మల్లంగి జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తొలి జాతీయ నాయకత్వ బృందంలో ఆయనకు చోటు దక్కింది. పార్టీ జాతీయ మీడియా సమన్వయకర్తతో పాటు దక్షిణాది రాష్ట్రాల ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఓ యువ సామాజిక కార్యకర్తకు జాతీయ స్థాయిలో ఇంతటి బాధ్యతలు అప్పగించడం విశేషంగా మారింది.
హైదరాబాద్‌లో జన్మించి పెరిగిన విజయ్‌రెడ్డి మల్లంగి ఇంజినీరింగ్ విద్యను నగరంలోనే పూర్తి చేశారు. అనంతరం అమెరికాలోని ప్రముఖ **Columbia University**లో ఉన్నత విద్యను అభ్యసించారు. విద్య పూర్తి చేసిన తర్వాత అమెరికాలో మూడేళ్లపాటు ఉద్యోగం చేసిన ఆయన, సామాజిక సేవ పట్ల ఉన్న ఆసక్తితో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి స్వదేశానికి తిరిగి వచ్చారు.
విద్యార్థి దశ నుంచే సామాజిక సమస్యలపై స్పందిస్తూ పలు ఉద్యమాల్లో విజయ్‌రెడ్డి చురుకైన పాత్ర పోషించారు. హైదరాబాద్‌లోని ‘సేవ్ కేబీఆర్’ ఉద్యమం, కంచ గచ్చిబౌలి భూముల పరిరక్షణ ఉద్యమాల్లో ఆయన కీలకంగా పనిచేశారు. పర్యావరణ పరిరక్షణ, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ విధానాలపై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు.
ఇటీవల పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్ నేతృత్వంలో 45 రోజుల పాటు నిర్వహించిన ఉద్యమంలో విజయ్‌రెడ్డి సమన్వయకర్తగా పనిచేశారు. ఆ ఉద్యమంలో ఆయన చూపిన అంకితభావం, నాయకత్వ లక్షణాలను గుర్తించిన సీజేపీ జాతీయ నాయకత్వం ఆయనకు ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
ఈ సందర్భంగా విజయ్‌రెడ్డి మాట్లాడుతూ, సీజేపీ రాజకీయ పార్టీ కాదని, స్థానిక సమస్యల పరిష్కారం కోసం పార్టీలకతీతంగా పనిచేసే సామాజిక ఉద్యమ వేదిక అని తెలిపారు. ప్రజల సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లడం, సామాజిక ఉద్యమాలకు బలం చేకూర్చడం సంస్థ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
తనపై నమ్మకంతో జాతీయ బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపిన విజయ్‌రెడ్డి, దక్షిణాది రాష్ట్రాల్లో సంస్థను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం యువతను ఉద్యమాల్లో భాగస్వాములను చేయడంపై ప్రత్యేక దృష్టి సారిస్తానని వెల్లడించారు.






