హైదరాబాద్ పాతబస్తీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రెండో తరగతి చదువుతున్న ఓ హిందూ విద్యార్థికి ఖురాన్‌లోని కల్మా, సూరా ఫాతిహా చదవాలని హోంవర్క్ ఇచ్చినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో రాజకీయ, విద్యా వర్గాల్లో కలకలం రేగింది.
విద్యార్థి స్కూల్ డైరీలో మతపరమైన పాఠాలు హోంవర్క్‌గా రాసి ఉండటాన్ని గమనించిన తల్లి వెంటనే పాఠశాలకు వెళ్లి సంబంధిత ఉపాధ్యాయుడిని ప్రశ్నించారు. హిందూ విద్యార్థికి ఖురాన్ పాఠాలు ఎందుకు ఇవ్వబడినట్లు నిలదీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విషయం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
వివాదం ముదరడంతో స్కూల్ యాజమాన్యం స్పందించింది. హోంవర్క్ ఇచ్చిన ఉపాధ్యాయుడిని అదే రోజు విధుల నుంచి తొలగించినట్లు ప్రకటించింది. ఇది పూర్తిగా ఉపాధ్యాయుడి వ్యక్తిగత తప్పిదమేనని, యాజమాన్యానికి దీనితో సంబంధం లేదని స్కూల్ ఎండీ తెలిపారు. తమ పాఠశాలలో ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగలేదని ఆయన స్పష్టం చేశారు.

ఇక ఈ ఘటనపై బీజేపీ, ఏబీవీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కూల్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించగా, పోలీసులు ముందస్తు జాగ్రత్తగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముట్టడికి ప్రయత్నించిన పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.
స్కూల్ యాజమాన్యం బహిరంగ క్షమాపణ చెప్పాలని, సంబంధిత ఉపాధ్యాయుడితో పాటు యాజమాన్యంపైనా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు కూడా ఈ ఘటనపై స్పందిస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.
వివాదం తీవ్రరూపం దాల్చడంతో విద్యాశాఖ అధికారులు కూడా పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు. స్కూల్ ఎండీ మాట్లాడుతూ, పాఠశాలలో అధిక శాతం మంది విద్యార్థులు ముస్లిం వర్గానికి చెందిన వారేనని, ఘటన అనంతరం బాధిత విద్యార్థి తండ్రితో మాట్లాడినట్లు తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యవహారంపై అధికారుల విచారణ కొనసాగుతోంది.






