హైదరాబాద్: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి నదులు, జలాశయాలు నిండాలని, రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా వరుణ యాగం నిర్వహించేందుకు సిద్ధమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు, నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మహా క్రతువు ఆగస్టు 10న నాగార్జునసాగర్‌లోని విజయ విహార్ ప్రాంగణంలో వైభవంగా జరగనుంది.
ప్రస్తుతం వర్షపాతం సాధారణ స్థాయిలో నమోదవుతున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా మరింత సమృద్ధిగా వర్షాలు కురిసి కృష్ణా, గోదావరి నదులు పరవళ్లు తొక్కాలని, జలాశయాలు పూర్తిస్థాయిలో నిండాలని, రైతులు మంచి దిగుబడులు సాధించాలని ప్రత్యేక సంకల్పంతో ఈ యాగాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఎల్ నినో ప్రభావం పూర్తిగా తొలగిపోయి రాష్ట్రంలో అనుకూల వాతావరణ పరిస్థితులు నెలకొనాలనే ఉద్దేశంతో ఈ యాగం చేపడుతున్నారు.
ఈ మహా యాగంలో యాదగిరిగుట్టకు చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వేద పండితులు, అర్చకులతో పాటు మొత్తం 108 మంది రుత్వికులు పాల్గొననున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 11 హోమకుండాలలో వేద మంత్రోచ్ఛారణల మధ్య వరుణ యాగం నిర్వహించనున్నారు.
యాగం చివరి ఘట్టమైన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. రాష్ట్ర శ్రేయస్సు, రైతాంగ సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు, పుష్కలంగా నీటి వనరులు లభించాలనే సంకల్పంతో ఈ మహా క్రతువు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
యాగానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే వేగంగా జరుగుతున్నాయి. భద్రత, వేదపండితుల వసతి, భక్తులకు అవసరమైన సౌకర్యాలు, యాగశాల నిర్మాణం వంటి ఏర్పాట్లను సంబంధిత శాఖలు సమన్వయంతో పూర్తి చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వరుణ యాగానికి పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వేదపండితులు, భక్తులు హాజరయ్యే అవకాశం ఉంది.






