భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు పి.టి. ఉష యువతకు స్ఫూర్తిదాయక సందేశం ఇచ్చారు. “పెద్ద కలలు కనండి.. ఆ కలలను నిజం చేసుకునేందుకు అంకితభావంతో కష్టపడండి.. ఎలాంటి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గొద్దు” అంటూ యువ క్రీడాకారులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ దేశ క్రీడా రంగానికి కొత్త దిశను చూపించే మైలురాయిగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. క్రీడల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ, అంతర్జాతీయ స్థాయిలో భారత అథ్లెట్ల ప్రతిభను మరింత మెరుగుపరచడంలో ఈ విశ్వవిద్యాలయం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
అథ్లెట్లకు సమగ్ర శిక్షణ
ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా పెట్టుకున్న క్రీడా భారత నిర్మాణానికి అనుగుణంగానే ఈ యూనివర్సిటీ ఏర్పాటైందని పి.టి. ఉష తెలిపారు. కోచ్‌లు, స్పోర్ట్స్ సైన్స్ నిపుణులు, స్పోర్ట్స్ మెడిసిన్, వైద్య సహాయక వ్యవస్థలు ఒకే వేదికపై అందుబాటులో ఉండటంతో అథ్లెట్లకు ప్రపంచ స్థాయి శిక్షణ లభిస్తుందని పేర్కొన్నారు. ఫిజికల్ ఎడ్యుకేషన్‌తో పాటు పారా స్పోర్ట్స్, స్పోర్ట్స్ రీసెర్చ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడం అభినందనీయమన్నారు.
క్రీడా నిపుణుల తయారీకి కేంద్రం
ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తులో దేశానికి అత్యుత్తమ కోచ్‌లు, ట్రైనర్లు, స్పోర్ట్స్ సైంటిస్టులను తయారు చేసే కేంద్రంగా ఎదగాలని ఆకాంక్షించారు. అథ్లెట్లతో పాటు రెఫరీలు, స్పోర్ట్స్ అడ్మినిస్ట్రేటర్ల తయారీలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, జట్టు భావన, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.
యంగ్ ఇండియా స్పోర్ట్స్ ఫెలోషిప్‌కు ప్రశంసలు
‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ ఫెలోషిప్’ వంటి కార్యక్రమాలు మరింత మంది యువతను క్రీడల వైపు ఆకర్షిస్తాయని పి.టి. ఉష అన్నారు. దేశంలోనే తొలి స్పోర్ట్స్ ఫెలోషిప్ కార్యక్రమానికి అనుసంధానంగా ఈ యూనివర్సిటీ పనిచేయడం విశేషమని కొనియాడారు.
తొలి వీసీకి అభినందనలు
యూనివర్సిటీ తొలి వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ కిషోర్ నియామకం పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఆయన నాయకత్వంలో ఈ విశ్వవిద్యాలయం ఉన్నత లక్ష్యాలను సాధిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. చివరగా యువతకు సందేశమిస్తూ.. “పెద్ద కలలు కనండి.. వాటి కోసం నిరంతరం శ్రమించండి.. ‘నెవర్ గివ్ అప్’ అనే నినాదంతో జీవితంలో ముందుకు సాగండి” అంటూ ప్రేరణనిచ్చారు.





