నిషేధిత భూముల జాబితాలో ప్రైవేటు భూములు చేరుతున్న ఫిర్యాదులపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ అంశంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. 22ఏ నిబంధనలను చూపిస్తూ ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు.
భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పవద్దని అధికారులను ఆదేశించారు. 22ఏ జాబితాలో భూమి ఉందన్న ఒక్క కారణంతో దరఖాస్తులను తిరస్కరించకుండా.. భూమి నిషేధిత జాబితాలోకి చేరడానికి గల కారణాలను ముందుగా పరిశీలించాలని సూచించారు.
రెవెన్యూ రికార్డులు, సంబంధిత పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని మంత్రి స్పష్టం చేశారు. ఒకవైపు నిజమైన భూ హక్కుదారులకు న్యాయం చేయాలని, మరోవైపు ప్రభుత్వ భూములను కాపాడాలని అధికారులకు సూచించారు.
సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశానికి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీవోలు, సబ్ రిజిస్ట్రార్లు హాజరయ్యారు. ప్రజల నుంచి వస్తున్న దరఖాస్తులు, ఫిర్యాదుల పరిష్కారంపై మంత్రి అధికారులను ఆరా తీశారు.
భూ సమస్యలపై ప్రజలు నేరుగా ఫిర్యాదు చేసేందుకు త్వరలో టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. 22ఏ భూముల పేరుతో అనవసర జాప్యం చేయకుండా, నిబంధనలకు అనుగుణంగా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.
