Home తెలంగాణ 22-A జాబితాపై తప్పు జరిగింది.. ప్రజలకు మంత్రి పొంగులేటి క్షమాపణ

22-A జాబితాపై తప్పు జరిగింది.. ప్రజలకు మంత్రి పొంగులేటి క్షమాపణ

12
0

హైదరాబాద్: తెలంగాణలో 22-ఏ కింద నిషేధిత భూముల జాబితా రూపొందించడంలో అధికారుల తప్పిదం జరిగినట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అంగీకరించారు. ఈ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆయన క్షమాపణలు తెలిపారు.

సోమవారం సచివాలయంలో 22-ఏ నిషేధిత జాబితాపై అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పట్టా, ప్రైవేట్‌ భూములు సైతం నిషేధిత జాబితాలో చేరడంతో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయని పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌, సంగారెడ్డి జిల్లాల్లో ఈ సమస్య ఎక్కువగా ఉందన్నారు.

గతంలో జారీ చేసిన జీవోలు, ఉత్తర్వులను పరిగణనలోకి తీసుకోకుండా జాబితా రూపొందించడంతో సమస్య తలెత్తిందని మంత్రి తెలిపారు. సంబంధిత ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయకపోవడంతో కొన్ని ప్రైవేట్‌ భూములు కూడా ప్రభుత్వ భూములుగా నమోదయ్యాయని చెప్పారు. ఈ తప్పును సరిదిద్దే ప్రక్రియ కొనసాగుతోందని, త్వరలోనే అర్హత ఉన్న భూములకు రిజిస్ట్రేషన్లు పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.

757 దరఖాస్తులు.. యూఎల్‌సీ భూములపైనా గందరగోళం

ఇప్పటి వరకు నాలుగు జిల్లాల నుంచి 757 దరఖాస్తులు అందినట్లు మంత్రి వెల్లడించారు. మేడ్చల్‌ జిల్లాలో నిషేధిత జాబితాలో చేరిన వాటిలో యూఎల్‌సీ భూములు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. గతంలోనే క్లియర్‌ చేసిన భూములను కూడా అధికారులు ప్రభుత్వ భూములుగా నమోదు చేయడంతో సమస్య ఏర్పడిందన్నారు.

జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ ద్వారా విక్రయించిన కొన్ని ప్లాట్ల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు కాకపోవడంతో అవి కూడా 22-ఏ జాబితాలోకి వెళ్లాయని చెప్పారు. ఇలాంటి భూములను పరిశీలించి నిషేధిత జాబితా నుంచి తొలగిస్తామని హామీ ఇచ్చారు.

వేలాది పార్సిళ్లపై ప్రభావం

సీఎస్‌-7, సీఎస్‌-14తో పాటు ఫారెస్ట్‌, ఎండోమెంట్‌ భూములకు సంబంధించిన పలు కేసులు ఉన్నాయని మంత్రి తెలిపారు. గతంలో జీవోలు, మెమోల ద్వారా కొన్ని భూములకు క్లియరెన్స్‌ ఇచ్చినా వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయకపోవడంతో సుమారు 35-38 వేల పార్సిళ్లు నిషేధిత జాబితాలోకి వచ్చినట్లు చెప్పారు.

అల్విన్‌, ఆస్‌బెస్టాస్‌ కాలనీల్లో ఒకే సర్వే నంబర్‌లో ప్రభుత్వ, ప్రైవేట్‌ భూములు ఉండటంతో ప్రైవేట్‌ స్థలాలు కూడా జాబితాలో చేరాయని తెలిపారు. వాటిని త్వరగా తొలగిస్తామని వెల్లడించారు. నారపల్లి సర్వే నంబర్‌ 867లో ఉన్న 20 ఎకరాల్లో ప్రభుత్వ భూమిని మినహాయించి మిగతా భూమిని జాబితా నుంచి తొలగిస్తామని చెప్పారు.

ఎలాంటి వివాదం లేని భూముల రిజిస్ట్రేషన్లను అడ్డుకునే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. సమస్యలను పరిష్కరించేందుకు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసి ప్రతి కేసును విడివిడిగా పరిశీలిస్తామని తెలిపారు. ఫిర్యాదుల కోసం 18005994788 టోల్‌ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

సీఎం రేవంత్‌ ఇంటి ప్లాట్‌ కూడా జాబితాలోకి?

22-ఏ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నివాసం ఉన్న జూబ్లీహిల్స్‌ సొసైటీకి చెందిన ప్లాట్లు కూడా చేరినట్లు మంత్రి తెలిపారు. జూబ్లీహిల్స్‌ సొసైటీకి చెందిన 356 ప్లాట్లు గతంలో ప్రభుత్వ ఖాతాలో ఉండేవని, అనంతరం సొసైటీకి కేటాయించిన ఉత్తర్వులను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయకపోవడంతో అవి నిషేధిత జాబితాలోకి వెళ్లాయని వివరించారు.

అందులో ముఖ్యమంత్రి నివాసం ఉన్న ప్లాట్‌ కూడా ఉండటాన్ని మంత్రి ప్రస్తావించారు. సంబంధిత ఉత్తర్వులను అప్‌లోడ్‌ చేసి తప్పుగా నమోదైన భూములను సరిచేస్తామని స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here