ఓ ఆటో డ్రైవర్ తన నిజాయితీతో నెటిజన్ల హృదయాలను గెలుచుకున్నాడు. పొరపాటున తన ఖాతాలోకి జమ అయిన భారీ మొత్తాన్ని యజమానికి తిరిగి ఇచ్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఓ ప్రైవేట్ కంపెనీ సీఈవో లింక్డ్‌ఇన్‌లో పంచుకోవడంతో ప్రస్తుతం ఈ కథ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
సీఈవో తెలిపిన వివరాల ప్రకారం.. అంతర్జాతీయ క్లయింట్‌ను కలిసేందుకు ఆయన ఆటోలో ప్రయాణించారు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత రూ.156 చెల్లించాల్సి ఉండగా, పొరపాటున రూ.15,682 ట్రాన్స్‌ఫర్ చేశారు. అయితే ఆ విషయం గుర్తించకుండానే హడావిడిగా సమావేశానికి వెళ్లిపోయారు.
ఆ సమావేశం ఆశించిన విధంగా జరగకపోవడంతో నిరాశగా బయటకు వచ్చిన ఆయనకు ఆశ్చర్యకరమైన విషయం ఎదురైంది. ఆటో డ్రైవర్ అల్తాఫ్ అక్కడే వేచి ఉండి, తన ఖాతాలోకి పొరపాటున వచ్చిన రూ.15,682 మొత్తాన్ని తిరిగి అందజేశాడు. అంతేకాదు, తన కోసం ఎదురుచూసినందుకు, కోల్పోయిన ప్రయాణాల కోసం కనీసం ఆటో ఛార్జీ అయినా తీసుకోవాలని సీఈవో కోరినా, అల్తాఫ్ వినయంగా తిరస్కరించాడు.
“మీ పరిస్థితి చూసి డబ్బులు తీసుకోవాలనిపించలేదు” అని అల్తాఫ్ చెప్పినట్లు సీఈవో వెల్లడించారు.
ఈ ఘటన జరిగిన వారం రోజుల తర్వాత, అదే అంతర్జాతీయ క్లయింట్ నుంచి సానుకూల స్పందన వచ్చింది. తమతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు వారు తెలియజేయడంతో సంతోషించిన సీఈవోకు వెంటనే అల్తాఫ్ గుర్తొచ్చాడు. కృతజ్ఞతగా అతని ఖాతాలోకి రూ.500 పంపించి, తన జీవితంలో మరచిపోలేని వ్యక్తిగా అభివర్ణించారు.
ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అల్తాఫ్ నిజాయితీకి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ఇలాంటి వ్యక్తుల వల్లే సమాజంపై నమ్మకం పెరుగుతుంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు.






