Home తెలంగాణ గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ఉచిత ప్రమాద బీమా

గుడ్ న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగులకు రూ.1.25 కోట్ల ఉచిత ప్రమాద బీమా

34
0

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అందించింది. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికీ ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం 14 బ్యాంకులతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుని ఈ వినూత్న బీమా పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది.

హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సమగ్ర ఆర్థిక భద్రత కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. ఉద్యోగులు కోరకముందే వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు.

ఈ పథకం కింద సాధారణ ప్రమాదంలో ఉద్యోగి మరణిస్తే రూ.1.25 కోట్ల బీమా రక్షణ లభిస్తుంది. విమాన ప్రమాదంలో మరణిస్తే బీమా మొత్తం రూ.3 కోట్ల వరకు అందనుంది. అలాగే 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల ఉద్యోగులకు రూ.10 లక్షల జీవిత బీమా కూడా వర్తిస్తుంది. ప్రమాదవశాత్తూ శాశ్వత సంపూర్ణ లేదా పాక్షిక వైకల్యం సంభవించినా ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

ఈ బీమా పథకం కేవలం రెగ్యులర్ ఉద్యోగులకే పరిమితం కాకుండా, ప్రభుత్వ రికార్డుల ద్వారా వేతనం పొందుతున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్, ఇతర తాత్కాలిక ఉద్యోగులందరికీ సమానంగా వర్తించనుంది. ప్రభుత్వం లేదా ఉద్యోగులపై ఒక్క రూపాయి అదనపు భారం లేకుండానే ఈ పథకాన్ని అమలు చేయడం విశేషం.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, మొదట సింగరేణి కార్మికులకు కోటి రూపాయల ప్రమాద బీమా అమలు చేయాలని ప్రతిపాదించినప్పుడు చాలామందికి నమ్మకం కలగలేదన్నారు. అయితే ప్రమాదాల్లో మరణించిన 45 మంది సింగరేణి కార్మికుల కుటుంబాలకు బీమా సొమ్ము అందించి ఆ హామీని నిలబెట్టామని గుర్తుచేశారు. ఉద్యోగుల సంక్షేమం విషయంలో తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, పీఆర్సీపై ఇచ్చిన హామీని కూడా తప్పకుండా అమలు చేస్తామని స్పష్టం చేశారు.

“నేను గుంపు మేస్త్రీనే” – సీఎం రేవంత్ రెడ్డి

కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. “నేను గుంపు మేస్త్రీనే. ఎవరు అవహేళన చేసినా పట్టించుకోను. నా మంత్రివర్గమే నా గుంపు, అదే నా బలం” అని అన్నారు. తనను “సార్” అని కాకుండా “రేవంత్ అన్న” అని పిలిస్తే మరింత ఆనందంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here