Home రాజకీయం కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.. “సభకు వచ్చి ఒప్పిస్తే కాళేశ్వరం బ్యారేజీలు మూడేళ్లు మీకే...

కేసీఆర్‌కు సీఎం రేవంత్ ఓపెన్ ఛాలెంజ్.. “సభకు వచ్చి ఒప్పిస్తే కాళేశ్వరం బ్యారేజీలు మూడేళ్లు మీకే అప్పగిస్తాం”

26
0

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఓపెన్ ఛాలెంజ్ విసిరారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తన వాదనలో బలం ఉందని నిరూపించగలిగితే, మూడు బ్యారేజీలను మూడేళ్ల పాటు ఆయనకే అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.

మంగళవారం ప్రజాభవన్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు పునర్నిర్మాణ చర్యలపై ప్రజాప్రతినిధులకు నిర్వహించిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ అనంతరం మాట్లాడిన సీఎం రేవంత్.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులపై తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రజలు తొమ్మిదిన్నరేళ్లు అధికారాన్ని అప్పగిస్తే రూ.8.21 లక్షల కోట్ల అప్పులు చేశారని ఆరోపించారు. రూ.38 వేల కోట్లతో పూర్తి కావాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టు వ్యయాన్ని రూ.1.21 లక్షల కోట్లకు పెంచారని విమర్శించారు.మూడేళ్లు అప్పగిస్తా.. కేసీఆర్‌.. సభకొచ్చి ఒప్పించి బాధ్యత తీసుకో:  సీఎం రేవంత్

రూ.1.02 లక్షల కోట్ల చెల్లింపులు చేసిన తర్వాత ప్రారంభమైన మూడేళ్లకే ప్రాజెక్టు దెబ్బతిందని, కాళేశ్వరం “కూలేశ్వరం”గా మారిందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసినందుకు కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను “ఆర్థిక ఉగ్రవాదులు”గా అభివర్ణించారు.

కాళేశ్వరం అంశంపై చర్చకు సిద్ధమని పేర్కొన్న సీఎం, కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి తన వాదనను వినిపించాలని సవాల్ విసిరారు. అవసరమైతే ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించేందుకూ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సాగునీటి నిపుణులు, అడ్వకేట్ జనరల్ సమక్షంలో బహిరంగంగా చర్చ జరపాలని ప్రతిపాదించారు.

“మీ వాదనలో నిజం ఉంటే, మీరు తప్పు చేయలేదని సభను ఒప్పించగలిగితే.. మూడు బ్యారేజీలను మూడేళ్ల పాటు మీకే అప్పగిస్తాం. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్లను తొలగించి, ప్రధాన కాంట్రాక్టర్‌గా మిమ్మల్నే నియమిస్తాం. మీకు నచ్చిన బృందంతో పనులు పూర్తి చేయండి” అని సీఎం రేవంత్ అన్నారు.

“మేడిగడ్డే కాళేశ్వరానికి వెన్నెముక”

కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కీలకమని సీఎం పేర్కొన్నారు. అది దెబ్బతినడంతో ప్రస్తుతం బ్యారేజీలో నీటిని నిల్వ చేసే పరిస్థితి లేదన్నారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ (NDSA) నివేదిక ప్రకారం అవసరమైన పరీక్షలు పూర్తయ్యే వరకు నీటిని నిల్వ చేయకూడదని సూచించిందని తెలిపారు. లేకపోతే బ్యారేజీలతో పాటు దిగువ ప్రాంతాలకు కూడా ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులను ప్రభుత్వం వేగంగా చేపడుతోందని స్పష్టం చేసిన సీఎం.. ప్రజలకు ఉపయోగపడేలా ప్రాజెక్టును తిరిగి అందుబాటులోకి తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.

అలాగే కాళేశ్వరం వ్యవహారంపై విచారణకు సంబంధించిన కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేశామని, కేసును సీబీఐకి అప్పగించినప్పటికీ ఇప్పటివరకు దర్యాప్తులో ఆశించిన పురోగతి కనిపించలేదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here