Home తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని తప్పుబట్టడం సరికాదు: ఈటల

కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తాన్ని తప్పుబట్టడం సరికాదు: ఈటల

25
0

ప్రజల ప్రయోజనాల విషయంలో తనకు తెలంగాణే మొదటి ప్రాధాన్యమని, ఆ తర్వాతే పార్టీ, వ్యక్తిగత అంశాలని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. తాను ఎవరో చెప్పినట్లు మాట్లాడే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సాగునీటి నిర్వహణ, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో తెలంగాణ ప్రాజెక్టుల్లోకి నీరు వస్తున్నప్పటికీ ప్రభుత్వం మోటార్లు ఆన్‌ చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోందని ఈటల ఆరోపించారు. వర్షాకాలంలోనూ సాగునీరు అందక రైతులు కష్టాలు పడుతున్నారని, ముఖ్యంగా ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాల్వల కింద బోర్లు, బావులు లేకుండా వ్యవసాయం చేయడం సాధ్యం కాదని చెప్పారు.
Eatala Rajender says wrong to blame entire Kaleshwaram project
తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, ఆత్మగౌరవం కోసమే జరిగిందని ఈటల గుర్తుచేశారు. రాజకీయాలు, సిద్ధాంతాలు వేరైనా మూలాలను మరచిపోవద్దన్నారు. కాళేశ్వరం కంటే ముందే వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం ద్వారా ప్రాణహిత జలాలను తీసుకురావాలనే ప్రణాళిక రూపొందిందని, శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు వంటి ప్రాజెక్టులకు అప్పుడే శ్రీకారం చుట్టారని వివరించారు.

స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ద్వారా కాళేశ్వరం ప్రాజెక్టును అభివృద్ధి చేసి ఎల్లంపల్లికి నీటిని తరలించే వ్యవస్థ ఏర్పాటు చేశారని చెప్పారు. ప్రస్తుతం మిడ్‌ మానేరు ప్రాజెక్టులో ఉన్న 29 టీఎంసీల నీరు కూడా ఆ ప్రాజెక్టుల ద్వారానే వచ్చిందన్నారు. కాళేశ్వరం వల్లే హుజూరాబాద్‌తో పాటు కరీంనగర్‌, వరంగల్‌, నల్గొండ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రెండు పంటలు సాధ్యమయ్యాయని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో కమీషన్లు, డిజైన్‌ మార్పులపై తాను మాట్లాడడం లేదని, కానీ మొత్తం ప్రాజెక్టునే తప్పుపట్టడం సరికాదని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. ప్రాజెక్టు పరిధిలోని దెబ్బతిన్న నిర్మాణాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని, లేకపోతే రాష్ట్రం తీవ్ర కరవును ఎదుర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here