Home తెలంగాణ తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వాన!

తెలంగాణకు భారీ వర్ష సూచన.. మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వాన!

2
0

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్‌ ప్రాంతాలపై కేంద్రీకృతమై పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.

ఈ వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు కూడా చురుగ్గా కదులుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, బలమైన ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

పలు జిల్లాల్లో భారీ వర్షాలు

గత 24 గంటల్లో మెదక్‌, ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యాయి. ములుగు జిల్లా ఏటూరునాగారంలో అత్యధికంగా 9.64 సెం.మీ వర్షపాతం నమోదైంది.

మెదక్‌ జిల్లా చేగుంటలో 8.11 సెం.మీ, మెదక్‌లో 7.68 సెం.మీ, శంకరంపేటలో 6.71 సెం.మీ వర్షం కురిసింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా పాలెంలలో 6.90 సెం.మీ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో 6.14 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

బుధవారం ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

బుధవారం ఆదిలాబాద్‌, కుమ్రం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

గురు, శుక్రవారాల్లోనూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

వర్షపాత లోటు

మరోవైపు జూన్‌, జూలై నెలల్లో వర్షపాత లోటు నమోదైనట్లు వాతావరణ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న మూడు రోజుల్లో కురిసే వర్షాలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షపాత లోటును కొంతవరకు భర్తీ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

భారీ వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాల సమయంలో చెట్లు, విద్యుత్‌ స్తంభాల కింద ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here