తుపాకీ పట్టుకుని అడవుల్లో సాయుధ పోరాటం చేసిన ఓ మాజీ మావోయిస్టు నేత.. ఇప్పుడు అదే గిరిజనుల హక్కుల కోసం ప్రభుత్వ వ్యవస్థతో కలిసి పనిచేయబోతున్నారు. తెలంగాణకు చెందిన మాజీ మావోయిస్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్‌రావు అలియాస్ భూపతి జీవితం ఇప్పుడు మరో మలుపు తిరిగింది.
గతంలో మావోయిస్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన భూపతి.. మహారాష్ట్రలోని గడ్చిరోలిలోని గోండ్వానా యూనివర్సిటీలో కోఆర్డినేటర్‌గా కొత్త బాధ్యతలు చేపట్టారు.
పెద్దపల్లిలో జన్మించిన భూపతి కరీంనగర్‌లో డిగ్రీ చదివారు. ఉస్మానియా యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తున్న సమయంలో మావోయిస్టు భావజాలం వైపు ఆకర్షితులై అజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతరం సీపీఐ (మావోయిస్టు) కేంద్ర కమిటీ సభ్యుడిగా, వ్యూహకర్తగా మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో పనిచేశారు.
ఒక దశలో ఆయనపై రూ.6 కోట్ల భారీ రివార్డు ఉండేది. అయితే గతేడాది అక్టోబర్‌లో మరో 60 మంది నక్సలైట్లతో కలిసి గడ్చిరోలి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
లొంగుబాటు తర్వాత కొత్త నిర్ణయం
సాయుధ పోరాటాన్ని వీడిన తర్వాత తన అనుభవాన్ని గిరిజనుల కోసం ఉపయోగించాలని భూపతి భావించారు. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారు. గడ్చిరోలి ఎస్పీ ఎం. రమేశ్ ఆయన దరఖాస్తును గోండ్వానా యూనివర్సిటీ వీసీకి సిఫార్సు చేశారు.
ఇంటర్వ్యూ అనంతరం ‘ఏకల్ ప్రోగ్రామ్’కు కోఆర్డినేటర్‌గా భూపతిని నియమించినట్లు వీసీ ప్రశాంత్ బోకరే తెలిపారు. మూడు నెలల కాంట్రాక్ట్‌పై పనిచేయనున్న ఆయనకు నెలకు రూ.30 వేల గౌరవ వేతనం లభించనుంది.
ఇక గిరిజనుల హక్కుల కోసం..
భూపతి గ్రామసభలు, గిరిజనులు, పరిపాలన మధ్య సమన్వయకర్తగా పనిచేయనున్నారు. పెసా, అటవీ హక్కుల చట్టాలపై గిరిజనులకు అవగాహన కల్పించడం, అటవీ హక్కుల దరఖాస్తులకు అవసరమైన పత్రాల సిద్ధీకరణలో సహాయం చేయడం, ప్రభుత్వ పథకాల అమలును పర్యవేక్షించడం ఆయన ప్రధాన బాధ్యతలు.
ఒకప్పుడు తుపాకీతో పోరాడిన ప్రాంతాల్లోనే ఇప్పుడు చట్టబద్ధమైన మార్గంలో గిరిజనుల హక్కుల కోసం పనిచేయడం.. భూపతి జీవితంలో ఊహించని పరిణామంగా నిలిచింది.






