హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను తగ్గించి, వాహనదారుల్లో రహదారి భద్రతపై అవగాహన పెంచేందుకు తెలంగాణ రవాణా శాఖ కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది. డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు దరఖాస్తు చేసుకునే వారు ఇకపై ముందుగా రెండున్నర గంటల ఆన్‌లైన్ వీడియో కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది. అనంతరం నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే తదుపరి లైసెన్స్ పరీక్షకు స్లాట్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.
ఆరు మాడ్యూల్స్.. 64 భద్రతా నియమాలు
కొత్త వీడియో కోర్సును 25 నిమిషాల చొప్పున ఆరు మాడ్యూల్స్‌గా రూపొందించారు. మొత్తం 64 రహదారి భద్రతా నియమాలతో పాటు వాహనం నడిపేటప్పుడు పాటించాల్సిన ప్రాథమిక, ప్రాక్టికల్ అంశాలను ఇందులో వివరించనున్నారు.
ప్రతి మాడ్యూల్ తర్వాత క్విజ్ నిర్వహిస్తారు. మొత్తం కోర్సు పూర్తయిన తర్వాత తుది పరీక్ష ఉంటుంది. అభ్యర్థి స్థానంలో మరొకరు పరీక్ష రాయకుండా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో పర్యవేక్షణ చేపట్టనున్నారు.
కూకట్‌పల్లిలో విజయవంతమైన పైలట్
కొత్త విధానాన్ని కూకట్‌పల్లి ఆర్టీఏ కార్యాలయంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా అమలు చేశారు. సుమారు 3,400 మంది LLR దరఖాస్తుదారుల్లో 2,800 మంది కోర్సును పూర్తి చేసినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఫలితాల ఆధారంగా 30–45 రోజుల్లో కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కొత్త విధానాన్ని అమలు చేయాలని అధికారులు భావిస్తున్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నారు.
మూడు భాషల్లో కోర్సు
ఆస్ట్రేలియా, యూకే, అమెరికా వంటి దేశాల్లో అమలవుతున్న రహదారి భద్రతా విధానాలను పరిశీలించి కోర్సును రూపొందించినట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థుల సౌకర్యార్థం వీడియోలు తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉండనున్నాయి.






