TGN NEWS (పటాన్ చేరు): పర్యావరణ స్థిరత్వం, పరిశుభ్రత, సామాజిక బాధ్యతలను పెంపొందించాలనే లక్ష్యంతో గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం మహిళా సాధికారత విభాగం (WEC) గురువారం మొక్కల నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది. విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని ఎంపిక చేసిన ప్రాంతాల్లో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పచ్చదనాన్ని పెంపొందించారు. గీతం కుటుంబ సభ్యులందరినీ పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములుగా చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. మహిళా సాధికారత విభాగం చైర్‌పర్సన్ ప్రొఫెసర్ ప్రీతి పర్వేకర్ మాట్లాడుతూ, “పర్యావరణ స్పృహను మన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవాలి. చిన్నచిన్న చర్యలే పెద్ద మార్పులకు దారి తీస్తాయి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, సీనియర్ అధ్యాపకురాలు ప్రొఫెసర్ ఎం.అక్కలక్ష్మి, క్రీడా విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నారాయణరావు, ఎస్టేట్ అధికారి ఎం.సతీష్ తదితరులు పాల్గొన్నారు.