అమరావతి రాజధానిలో ప్రతిపాదిత సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణానికి సంబంధించిన కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. రహదారి నిర్మాణంపై గతంలో విధించిన మధ్యంతర ఉత్తర్వులను తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తయింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. తుది తీర్పు వెలువడే వరకు వివాదాస్పద భూముల విషయంలో యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది.
జస్టిస్ రవీంద్రనాథ్ తిలకరి, జస్టిస్ చింతలపూడి పురుషోత్తం కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. కోర్టు విధించిన మధ్యంతర ఉత్తర్వుల కారణంగా కీలకమైన సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయని, దీంతో ప్రాజెక్టు ఆలస్యం అవుతోందని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరారు. రహదారి నిర్మాణానికి అవసరమైన భూములను చట్టబద్ధమైన భూసేకరణ ప్రక్రియ ద్వారానే సేకరించినట్లు ధర్మాసనానికి వివరించారు.
మరోవైపు, పెనుమాక గ్రామానికి చెందిన చోడిశెట్టి నిర్మలత ఈ కేసును దాఖలు చేశారు. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం తన భూమిని సేకరించే సమయంలో అధికారులు చట్టపరమైన నిబంధనలను పాటించలేదని ఆమె పిటిషన్‌లో ఆరోపించారు.
ఇరుపక్షాల వాదనలు పూర్తవడంతో.. కేసులో తీర్పును రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు ధర్మాసనం ప్రకటించింది. అప్పటివరకు వివాదాస్పద భూములపై యథాతథ స్థితి కొనసాగనుంది.






