హైదరాబాద్‌లో ప్రజా భద్రతను మరింత బలోపేతం చేసేందుకు పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఇందులో భాగంగా రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ చెరువు పరిసర ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా ప్రత్యేక నిఘా నిర్వహించారు.
నిఘా సందర్భంగా చెరువు సమీపంలోని బహిరంగ ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నట్లు డ్రోన్ కెమెరాలు గుర్తించాయి. డ్రోన్ ద్వారా రికార్డైన ప్రత్యక్ష దృశ్యాలు వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్‌కు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
దీంతో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సరూర్‌నగర్ పోలీస్ బీట్ కానిస్టేబుల్‌కు సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బహిరంగంగా మద్యం సేవిస్తున్న ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు.
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరం కావడంతో, నిబంధనల ప్రకారం వారిపై కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
నగరంలో శాంతిభద్రతల పరిరక్షణ, మహిళలు మరియు ప్రజల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు డ్రోన్ నిఘాను విస్తృతంగా వినియోగిస్తున్నామని అధికారులు వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, కఠిన చర్యలు తప్పవని పోలీస్ కమిషనర్ సుమతి హెచ్చరించారు.
