హైదరాబాద్ శివారులో అక్రమ వెంచర్లపై అధికారుల దూకుడు పెరిగింది. శంకర్‌పల్లి మండలం జన్వాడలో సుమారు 60 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న భారీ లేఅవుట్‌పై హెచ్‌ఎండీఏ, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సంయుక్తంగా చర్యలు చేపట్టారు. గండిపేట జలాశయ పరిరక్షణకు సంబంధించిన 111 జీవో నిబంధనలను ఉల్లంఘించినట్లు గుర్తించిన అధికారులు సోమవారం కూల్చివేతలు నిర్వహించారు.
వెంచర్‌లో క్లబ్‌హౌస్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పిల్లర్లు, కాంక్రీట్ నిర్మాణాలను ఎక్స్‌కవేటర్ల సాయంతో కూల్చివేశారు. అంతేకాకుండా అనుమతులు లేకుండా నిర్మించిన రోడ్లు, ఫుట్‌పాత్‌లు, బాక్స్ డ్రెయిన్లను కూడా ధ్వంసం చేశారు.
ముందుగా తనిఖీలు.. ఆ తర్వాత నోటీసులు
జన్వాడలోని వెంచర్‌పై రెండు రోజుల క్రితం హెచ్‌ఎండీఏ, రెవెన్యూ, ఇరిగేషన్, సీఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నట్లు నిర్ధారించిన అనంతరం రియల్టర్లకు నోటీసులు జారీ చేశారు.
తహసీల్దార్ ఆదేశాలతో సోమవారం కూల్చివేతలు చేపట్టారు. 111 జీవో పరిధిలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
సీఎంసీ పరిధిలోనూ భారీగా కూల్చివేతలు
జన్వాడలోనే కాకుండా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇతర ప్రాంతాల్లోనూ అనధికార నిర్మాణాలపై అధికారులు చర్యలను ముమ్మరం చేశారు.
కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి జోన్లలో సోమవారం ఒక్కరోజే 16 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మరో 15 అనధికార నిర్మాణాలను గుర్తించిన అధికారులు.. వాటిలో ఒక నిర్మాణాన్ని సీజ్ చేసినట్లు వెల్లడించారు.
జలాశయాల పరిరక్షణ, పట్టణ ప్రణాళిక నిబంధనల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ చర్యలపై స్థానికులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.






