హైదరాబాద్: జబర్దస్త్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన నటుడు మహేష్ ఆచంట ప్రస్తుతం సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా ‘రంగస్థలం’ చిత్రంలో చిట్టిబాబు స్నేహితుడి పాత్రతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న మహేష్, ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు.
దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా మహేష్ కెరీర్‌కు కీలక మలుపు తీసుకొచ్చింది. అనంతరం శతమానం భవతి, మహానటి వంటి చిత్రాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు పొందాడు. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ, హీరో విశ్వక్ సేన్ వంటి సినీ ప్రముఖుల ప్రోత్సాహంతో ప్రస్తుతం వరుస అవకాశాలు అందుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు.
అయితే తాజాగా మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఆయన భావోద్వేగంగా మాట్లాడిన తీరు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది.
“లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్”
వీడియోలో మహేష్ మాట్లాడుతూ..
“లైఫ్ చాలా అన్‌ప్రెడిక్టబుల్. ఎప్పుడు ఎవరి జీవితంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. బయట కనిపించే విషయాలను చూసి ఏవేవో ఊహించుకుని నిజమని నమ్మేయడం సరైంది కాదు. ముఖ్యంగా రిపోర్టర్లు, మీమర్స్‌కు నా విజ్ఞప్తి… నేను నిజం చెప్పే వరకు ఎలాంటి ఊహాగానాలు ప్రచారం చేయొద్దు. త్వరలో నేనే పూర్తి వివరాలు చెబుతాను.”
అంటూ చెప్పుకొచ్చాడు.
నెటిజన్లలో ఆసక్తి.. అసలు ఏమైందంటూ చర్చ
మహేష్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు, నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ఏమైంది అన్నా?”, “ఎంత కష్టం వచ్చింది?”, “అన్నీ బాగానే ఉన్నాయా?” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
మరోవైపు, కొందరు మాత్రం ఇది కొత్త సినిమా లేదా వెబ్ సిరీస్ ప్రమోషన్‌లో భాగంగా చేసిన ప్రచార వీడియో కావచ్చని అభిప్రాయపడుతున్నారు. మహేష్ పూర్తి వివరాలు వెల్లడించే వరకు ఈ సస్పెన్స్ కొనసాగనుంది.




