మేడ్చల్ జిల్లాలో రియల్ ఎస్టేట్ మోసం ఆరోపణలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలనే ఆశతో జీవితాంతం కూడబెట్టిన పొదుపు మొత్తాన్ని ప్లాట్ల కొనుగోలుకు వెచ్చించిన పలువురు కుటుంబాలు ఇప్పుడు తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హైదరాబాద్ చింతల్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తమను మోసం చేశాడని ఆరోపిస్తూ బాధితులు మేడ్చల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
బాధితుల కథనం ప్రకారం, హైదరాబాద్ చింతల్‌కు చెందిన కల్లూరి సుభాష్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి మేడ్చల్ మండలం రావల్‌కోల్ గ్రామ పంచాయతీ పరిధిలోని గూడెం గడ్డ తండా వద్ద “ఎస్‌ఆర్ వెంచర్” పేరుతో లేఅవుట్ ఏర్పాటు చేసి ప్లాట్లను విక్రయించాడు. అయితే ఆ వెంచర్‌కు అవసరమైన HMDA, DTCP లేదా ఇతర అధికారిక అనుమతులు లేకుండానే ప్లాట్లు విక్రయించి భారీగా డబ్బులు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.
బాధితుల వివరాల ప్రకారం, ప్రభుత్వం ఇప్పటికే 2019లో ఆ ప్రాంతం కాళేశ్వరం ప్రాజెక్టు కాలువ పరిధిలోకి వస్తుందని ప్రకటించింది. అయినప్పటికీ ఈ విషయాన్ని కొనుగోలుదారులకు తెలియజేయకుండా, 2020లో హడావుడిగా ప్లాట్లు విక్రయించినట్లు వారు చెబుతున్నారు. వెంచర్‌లో సుమారు 70 మంది ప్లాట్లు కొనుగోలు చేయగా, అందులో సగానికి పైగా ప్లాట్లు కాళేశ్వరం కాలువలోకి వెళ్లిపోయాయి. దీంతో తమకు లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని బాధితులు వాపోతున్నారు.
ఈ విషయం తెలిసిన తర్వాత వ్యాపారిని పలుమార్లు సంప్రదించామని, తమ ప్లాట్లకు బదులుగా అదే ప్రాంతంలో మరో వెంచర్‌లో ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇస్తానని హామీ ఇచ్చాడని బాధితులు తెలిపారు. అయితే 2020 నుంచి ఇప్పటి వరకు “ఇవాళ ఇస్తా.. రేపు ఇస్తా” అంటూ కాలయాపన చేస్తూ వస్తున్నాడని ఆరోపించారు. ఎన్నిసార్లు ప్రయత్నించినా సమస్యకు పరిష్కారం చూపకపోవడంతో చివరకు పోలీసులను ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు.
బాధితుల ఫిర్యాదు మేరకు మేడ్చల్ పోలీసులు సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో మరో కీలక ఆరోపణ కూడా బాధితులు చేశారు. కాళేశ్వరం కాలువలోకి వెళ్లిన భూములకు ప్రభుత్వం చెల్లించిన నష్టపరిహారాన్ని కూడా సుభాష్ రెడ్డే తీసుకున్నాడని వారు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై కూడా పోలీసులు విచారణ చేపట్టాలని వారు కోరుతున్నారు.
అంతేకాకుండా, గతంలో కూడా లింగాపూర్, మైసిరెడ్డిపల్లి, రావల్‌కోల్ ప్రాంతాల్లో ఇదే వ్యాపారి పలు వెంచర్లు ఏర్పాటు చేసి అమాయక ప్రజలను మోసం చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం “ఎస్‌ఆర్ వెంచర్”కు సంబంధించిన బోర్డులు, కార్యాలయం లేదా ఇతర ఆనవాళ్లు కూడా కనిపించడం లేదని బాధితులు చెబుతున్నారు.
ఈ ఘటన నేపథ్యంలో ప్లాట్లు కొనుగోలు చేసే ముందు ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని బాధితులు సూచిస్తున్నారు. వెంచర్‌కు HMDA, DTCP లేదా స్థానిక సంస్థల అనుమతులు ఉన్నాయా? భూమిపై ఎలాంటి ప్రభుత్వ ప్రాజెక్టులు ఉన్నాయా? భూ రికార్డులు, లేఅవుట్ అనుమతులు, రిజిస్ట్రేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నాయా? వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






