- గీతం ఆతిథ్య ఉపన్యాసంలో స్పష్టీకరించిన ఐఐఎం ఇండోర్ అధ్యాపకుడు డాక్టర్ అజీమ్ ఖాన్
TGN NEWS (పటాన్ చేరు): ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా భారతదేశం అమెరికా సుంకాలపై ప్రత్యక్ష ప్రతీకార చర్యలకు దిగబోదని ఐఐఎం ఇండోర్ అర్థశాస్త్రం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ అజీమ్ ఖాన్ అభిప్రాయపడ్డారు. గీతం స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘సుంకాల యుద్ధం: ఆర్థికవేత్తల దృక్పథం’ అనే అంశంపై గురువారం ఆయన ఆన్ లైన్ ద్వారా ఆతిథ్య ఉపన్యాసం చేశారు. అధిక సుంకాలను దౌత్యం మార్గంలో చర్చల ద్వారా తగ్గించుకునేందుకు ఓవైపు ప్రయత్నిస్తూనే, మరోవైపు ఇతర దేశాలకు ఎగుమతి అవకాశాలతో పాటు దేశీయ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు మద్దతు ఇచ్చే మార్గాన్ని భారతదేశం అవలంబిస్తోందన్నారు. సాధారణంగా, దేశీయ పరిశ్రమలను రక్షించడానికి, దుర్బల రంగాలలో ఉద్యోగాలను కాపాడటానికి, ఆదాయాన్ని సంపాదించడానికి, వాణిజ్య అసమతుల్యలతలను పరిష్కరించడానికి, జాతీయ భద్రతను కాపాడుకోవడానికి, డంపింగ్, విదేశీ సబ్సిడీల వంటి అన్యాయమైన పద్ధతులను ఎదుర్కోవడానికి మాత్రమే సుంకాలు విధిస్తారని డాక్టర్ ఖాన్ వివరించారు. భారతీయ వస్తువులపై ఇటీవలి 50 శాతం అమెరికా సుంకాలు వస్త్ర రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయని, ఆర్డర్లు నిలిచిపోయాయని అన్నారు. రత్నాభరణాలు, తోలు, సముద్రఉత్పత్తులు, రసాయనాలు వంటి ఇతరరంగాలు కూడా దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ఈ చర్యలు భారతదేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని 0.3-0.5 శాతం తగ్గించవచ్చని, తద్వారా 4 నుంచి 5 బిలియన్ డాలర్ల ఎగుమతులు తగ్గడంతో పాటు రూపాయి విలువ కూడా క్షీణించే ప్రమాదం లేకపోలేదన్నారు. అమెరికా సుంకాల వల్ల యేటా 2.985 బిలియన్ డాలర్ల విలువైన భారతీయ ఎగుమతులను ప్రభావితం చేస్తాయని, తద్వారా 723.74 మిలియన్ డాలర్ల సుంకాలు అమెరికా కోల్పోతుందని డాక్టర్ ఖాన్ తెలియజేశారు. అమెరికా అధిక సుంకాలు, భారతదేశం కొత్త మార్కెట్లను అన్వేషించడానికి ఒక అవకాశంగా పేర్కొన్నారు. ప్రపంచ వాణిజ్య సంస్థ సిఫారసులను తరచుగా అమెరికా విస్మరిస్తోందన్నారు. 2030 నాటికి ప్రపంచంలోని మూడు అగ్ర వాణిజ్య శక్తులలో ఒకటిగా ఎదగాలనే భారతదేశం యొక్క ఆశయాన్ని ఆయన నొక్కి చెబుతూ, ఎగుమతులలో ఒక ట్రిలియన్ డాలర్ల బలమైన ప్రపంచ సరఫరా గొలుసు ఏకీకరణ, స్థిరమైన, సేవల ఆధారిత వాణిజ్యంలో నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నామన్నారు. తొలుత, జీఎస్ హెచ్ఎస్ ఇన్-ఛార్జి డైరెక్టర్ డాక్టర్ శామ్యూల్ థరు అతిథిని స్వాగతించగా, సమన్వయకర్త డాక్టర్ అథారీ జానిసో వందన సమర్పణ చేశారు.
