- క్రషర్ మిషన్‌తో రైతుల భవిష్యత్తు అంధకారం.. రావల్‌కోల్‌లో నిరసన దీక్ష
- వ్యవసాయ భూములను కాపాడండి.. రావల్‌కోల్ రైతుల ఆవేదన
- క్రషర్ మిషన్ రద్దు చేయాలి.. ఆమరణ దీక్షకు సిద్ధమైన రైతులు
TGN NEWS (మేడ్చల్ ): ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని రావల్‌కోల్ గ్రామంలో ప్రతిపాదిత క్రషర్ మిషన్ ఏర్పాటుకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన బాట పట్టారు. గ్రామంలోని సర్వే నెంబర్ 111లో క్రషర్ మిషన్ ఏర్పాటు చేస్తే తమ వ్యవసాయ భూములు, పంటలు తీవ్రంగా దెబ్బతింటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామానికి అత్యంత సమీపంలో క్రషర్ మిషన్ ఏర్పాటు చేయడం వల్ల నిరంతరం దుమ్ము, ధూళి వ్యాపించి పంటల ఉత్పాదకత తగ్గిపోతుందని రైతులు చెబుతున్నారు. అంతేకాకుండా శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం కారణంగా గ్రామ ప్రజలు, ముఖ్యంగా చిన్నారులు అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు జిల్లా కలెక్టర్, సంబంధిత మంత్రులు, స్థానిక ఎంపీ ఈటెల రాజేందర్‌కు వినతిపత్రాలు సమర్పించినప్పటికీ క్రషర్ మిషన్ పనులు మాత్రం కొనసాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. గతంలో అధికారులు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో గ్రామస్తులు ఎవరూ క్రషర్ మిషన్‌కు అనుకూలంగా సంతకాలు చేయలేదని, అయినప్పటికీ కొందరి పలుకుబడితో అనుమతులు పొందారని రైతులు వాపోతున్నారు.
తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను నాశనం చేసే ప్రయత్నం జరుగుతోందని మండిపడిన రైతులు, వెంటనే క్రషర్ మిషన్ అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించి న్యాయం చేయకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.
గ్రామ ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ, రైతుల జీవనోపాధి దృష్ట్యా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని రైతులు కోరుతున్నారు.




