అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్‌లో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే భావోద్వేగానికి గురయ్యారు. అభిమానులు, చిత్రబృందం అందించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞతలు తెలుపుతూ వేదికపైనే కన్నీళ్లు పెట్టుకున్నారు.
మాట్లాడుతూ ముందుగా దర్శకుడు మురళి కిశోర్ అబ్బూరుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. “‘భారతి’ పాత్రను నాపై నమ్మకంతో అప్పగించకపోయి ఉంటే, ఈ రోజు నాకు ఇంతటి గుర్తింపు వచ్చేది కాదు. నన్ను నమ్మి అవకాశం ఇచ్చినందుకు జీవితాంతం రుణపడి ఉంటాను” అని చెప్పారు.
హీరో అఖిల్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, “నువ్వు ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డావో నేను దగ్గర నుంచి చూశాను. సెట్‌లో ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా సినిమా కోసం అంకితభావంతో పనిచేశావు. ఈ విజయం నీ కష్టానికి దక్కిన ఫలితం. నువ్వు ఈ ప్రేమకు పూర్తిగా అర్హుడివి. నీతో మరోసారి కలిసి నటించాలని ఎదురుచూస్తున్నాను” అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.
అభిమానుల గురించి మాట్లాడుతుండగా భాగ్యశ్రీ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. “గత ఏడాదిన్నర కాలంలో నా జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురయ్యాయి. నేను నిరాశలో ఉన్న ప్రతిసారీ అభిమానులు పంపిన సందేశాలు, రీల్స్, వారి ప్రేమ, ప్రోత్సాహమే నన్ను నిలబెట్టాయి” అని ఉద్వేగంగా చెప్పారు.
ఆ తర్వాత కాస్త తేరుకుని, “హైదరాబాద్ నా కర్మభూమి. నా చివరి సినిమా కూడా ఇక్కడే చేయాలని కోరుకుంటున్నాను. మీరు చూపించిన ప్రేమకు జీవితాంతం రుణపడి ఉంటాను. అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు” అంటూ తన ప్రసంగాన్ని ముగించారు.
మురళి కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ‘లెనిన్’ చిత్రంలో అఖిల్‌కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే ‘భారతి’ పాత్రలో నటించారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను అందుకుంటోంది. సినిమాకు నవీన్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించగా, తమన్ సంగీతం సమకూర్చారు. ఎడిటర్‌గా నవీన్ నూలి వ్యవహరించారు.





