– పారదర్శకంగా సమస్యలు పరిష్కరించాల్సింది పోయి..
తమ స్వార్థ ప్రయోజనాలకోసం వాడుకుంటున్న అక్రమార్కులు
– అధికారులు నిబద్దతతో వ్యవహరించాలంటున్న ప్రజలు
ప్రజావాణి అంటే ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువస్తే వాటిని నిబద్దతతో పరిశీలించి.. పారదర్శకంగా వ్యవహరించి.. ఎలాంటి పక్షపాత వైఖరిని అవలంభించకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సిన వ్యవస్థ. అందుకు భిన్నంగా శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో ప్రజావాణి నడుస్తోందని పలువురు ఫిర్యాదు దారులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ రంగంలో పారదర్శకత, బాధ్యతాయుత సేవల కోసం ఇది ఒక మంచి వేదికగా పనిచేయాల్సిందిపోయి అందుకు భిన్నంగా నడుస్తోందని అంటున్నారు. అయితే, ఇటీవల శేరిలింగంపల్లి జోన్ పరిధిలోని సర్కిల్‌లలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని కొందరు అక్రమార్కులు అనుకూలంగా చేసుకుంటున్నారు. ధనార్జనే ధ్యేయంగా ప్రజల మద్దతు, ఎలక్ట్రానిక్ మీడియా ప్రమేయంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి, అక్రమ నిర్మాణాలు, లే-అవుట్లు, అనుమతిలేని పనులకు అనుకూలంగా మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. పాలక వ్యవస్థపై నమ్మకంతో ప్రజలు విచారణ కోసం వచ్చే ఈ వేదికను కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకోవడంపై పలువురు విష్లేషకులు మండిపడుతున్నారు. వ్యవస్థలో అధికారులు పారదర్శకంగా వ్యవహరించాల్సిందిపోయి ఇలా చేయడం ఏంటని ఘూటుగా విమర్శిస్తున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి ప్రజావాణి కార్యక్రమాన్ని పారదర్శంగా నిర్వహిస్తారో లేదో వేచి చూడాలి.
