తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. అవినీతి కారణంగానే ఈ రెండు పార్టీలు మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మౌనం వహిస్తోందని విమర్శించారు.
సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో కవిత ప్రసంగించారు. బంగారు తెలంగాణ పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్.. పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకుందని ఆరోపించారు. ఆ పార్టీ హయాంలో నాలుగు ఇళ్లు మాత్రమే బంగారమయ్యాయని ఎద్దేవా చేశారు.
రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నిజామాబాద్ జిల్లాలో ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేకపోయారని కవిత విమర్శించారు.
వ్యక్తిగత అంశాలపై భావోద్వేగం
సభలో వ్యక్తిగత అంశాలను ప్రస్తావిస్తూ కవిత భావోద్వేగానికి గురయ్యారు. ప్రశాంత్‌రెడ్డి తనను తండ్రి నుంచి దూరం చేశారని ఆరోపించారు. హరీశ్‌రావు, సంతోష్‌రావును క్షమించినా.. ప్రశాంత్‌రెడ్డిని మాత్రం జీవితంలో క్షమించబోనని స్పష్టం చేశారు.
తాను ఎలాంటి తప్పు చేయకపోయినా నాలుగేళ్ల పాటు ఈడీ, సీబీఐతో వేధించి తీహార్ జైలులో పెట్టారని కవిత అన్నారు. తాను నిర్దోషినని సుప్రీంకోర్టు చెప్పిందని పేర్కొన్నారు. దేశ చరిత్రలో తొలిసారిగా ఒక సీబీఐ అధికారిపై విచారణకు ఆదేశాలు వచ్చాయని ఆమె వ్యాఖ్యానించారు.
ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతోనే తాను పార్టీ పెట్టానని, పదవుల కోసం కాదని కవిత తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయినా ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాల్సిన బీఆర్ఎస్ ప్రతిపక్షంగా నిద్రపోతోందని ఆరోపించారు.


