హైదరాబాద్: ప్రభుత్వానికి బకాయిలు చెల్లించకుండా డిఫాల్ట్ అయిన రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మిల్లర్ల నుంచి ప్రభుత్వానికి రావాల్సిన బకాయిలను త్వరితగతిన వసూలు చేయడమే ప్రధాన లక్ష్యంగా సమగ్ర విధానం రూపొందించాలని సూచించారు. ఈ విధానాన్ని కేబినెట్ సబ్ కమిటీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించారు.
ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో సివిల్ సప్లయిస్ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం పలు కీలక సూచనలు చేశారు. మిల్లర్లు బకాయిల చెల్లింపుల విషయంలో బ్లాక్‌మెయిల్‌కు పాల్పడితే సహించబోమని స్పష్టం చేశారు.
ఉద్దేశపూర్వకంగా డిఫాల్ట్ అయిన రైస్ మిల్లులను స్వాధీనం చేసుకుని మహిళా సంఘాలకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలని సీఎం సూచించారు. అవసరమైతే మిల్లింగ్ బాధ్యతలను కూడా మహిళా సంఘాలకు అప్పగించాలని ఆదేశించారు.
ఐదు నియోజకవర్గాల్లో గోడౌన్ల పైలట్ ప్రాజెక్టు
మార్కెట్‌లో అందుబాటులో ఉన్న గోడౌన్లను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సీఎం సూచించారు. ధాన్యం అధికంగా ఉత్పత్తి అయ్యే ప్రాంతాలను ఎంపిక చేసి, ఐదు నియోజకవర్గాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో 50 నుంచి 100 ఎకరాల విస్తీర్ణంలో గోడౌన్ల నిర్మాణానికి పైలట్ ప్రాజెక్టు చేపట్టాలని ఆదేశించారు.
గోడౌన్ల నిర్మాణానికి గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులను వినియోగించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించి సివిల్ సప్లయిస్ కార్యకలాపాల పర్యవేక్షణను మరింత బలోపేతం చేయాలని సీఎం ఆదేశించారు.
సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ చైర్మన్ స్టీఫెన్ రవీంద్ర, సీఎంఓ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






